సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఆప్యాయంగా సి.నా.రె. అనిపిలుచుకుంటారు. ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. నేడు మహోన్నత వ్యక్తి జయంతి. తెలుగు సాహిత్యానికి నిలువుటద్దం సి.నా.రె. ఎందుకంటే మాతృభాషకు ఆయన చేసిన సేవలు అన్నీఇన్నీ కావు. ఒక తెలుగు కవిగా.. సాహితీవేత్తగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అంతేకాదు తెలుగు చలన చిత్రరంగంలో సి.నారాయణ రెడ్డి చేతి నుండి జాలువారిన పాటలు ప్రజల మనసులను గెలుచుకున్నాయి. నన్నుదోచుకొందువటే వన్నెల దొరసాని, వటపత్రశాయికి వరహాల లాలి అనే, తెలుగువీర లేవరా.. అనే పాటలు సి.నారాయణ రెడ్డిని ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయేలా చేశాయి. ఉత్తమ పాటల రచయితగా పలు పురస్కారాలు వరించాయి.
 
సి.నారాయణ రెడ్డి స్వగ్రామం కరీంనగర్ జిల్లాలోని హనుమాజీపేట. 1931వ సంవత్సరం జులై 29వ తేదీన రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు మల్లారెడ్డి. తల్లి పేరు బుచ్చమ్మ. తండ్రి రైతు కాగా.. తల్లి మాత్రం ఇంటి పనులు చక్కబెట్టేవారు. సి.నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య అంతా సొంత గ్రామంలోని గవర్నమెంట్ పాఠశాలలోనే సాగింది. చిన్నతనం నుండే ఆయన జానపదాలు, హరికథలపై ఆసక్తి చూపేవారు. అలా ఆయనకు తెలుగుపై ఎనలేని మమకారం ఏర్పడింది. ఇక కరీంనగర్ లో హైస్కూల్ చదువు పూర్తి చేశారు. ఇక హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ కాలేజీలో 12వ తరగతి.. ఓయూలో బీఏ పట్టా అందుకున్నారు. నారాయణ రెడ్డి ఉర్దూ మీడియంలో బీఏ పూర్తి చేయడం విశేషం. అంతేకాదు ఓయూ నుండే తెలుగు సాహిత్యంలో పీజీ.. డాక్టరేట్ పొందారు. విద్యార్థి దశలోనే అనేక గ్రంథాలను చదివారు. అంతేకాదు ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం లాంటి నాటకాలు రచించి ఔరా అనిపించారు.  

తొలుత సికింద్రాబాదులోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, ఆ తర్వాత నిజాం కాలేజీలో లెక్చరెర్ గా విధులు నిర్వర్తించారు. అంతేకాదు ఓయూలో ప్రొఫెసర్ గా పనిచేశారు. పెద్ద పదవులు సైతం అధిరోహించారు. విశ్వంభర కావ్యం రచించి.. అందరితో భేష్ అనిపించుకున్నారు. అంతేకాదు జ్ఞానపీఠ పురస్కారం కూడా అందుకున్నారు. సి.నారాయరెడ్డి రాజ్యసభ సభ్యునిగా రాణించారు. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో అనేక పాటలు రాసి ప్రేక్షకుల మన్ననలు పొందారు. 1990వ సంవత్సరంలో యుగోస్లేవియాలోని నిర్వహించిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొని తెలుగు జాతికి వన్నెతెచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: