ఒలింపిక్స్.. విశ్వ క్రీడా వేదిక.. ఈ ఒలింపిక్స్‌లో పాల్గొని పతకాలు సాధించాలని ప్రతి దేశమూ కలలు కంటుంది. ఎందుకంటే అది అంతర్జాతీయ గుర్తింపు. ఇలాంటి క్రీడల్లో అగ్రభాగాన నిలవాలని పోటీ పడే దేశాల్లో రష్యా కూడా ఒకటి. పతకాల జాబితాలోనూ టాప్‌లో ఎప్పుడూ ఉంటుంది రష్యా..  అయితే.. విచిత్రం ఏంటంటే.. ఈసారి ఒలింపిక్స్‌లో రష్యా పేరు ఎక్కడా వినిపించడం లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే.. రష్యన్ ఆటగాళ్లు మాత్రం ఈ ఒలింపిక్స్‌లో ఆడుతూనే ఉన్నారు.


రష్యా దేశం పేరు లేకుండా.. ఆ దేశ ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారంటారా.. అక్కడే ఉంది అసలు విషయం. గతంలో డోపింగ్‌ పరీక్షల్లో పలుసార్లు దొరికిపోవడంతో రష్యాను ఒలింపిక్స్ నుంచి రెండు దఫాలు బహిష్కరించారు. అయితే ఇలా తమ దేశాన్ని బహిష్కరించడం అన్యాయం అంటూ రష్యా స్పోర్ట్స్‌ ఆర్బిట్రేషన్ సంస్థను ఆశ్రయించింది. దీంతో ఈ సంస్థ మధ్యే మార్గంగా ఓ ఉపాయం చెప్పింది. అదేంటంటే.. రష్యన్ ఆటగాళ్లు ఒలింపిక్స్‌లో పాల్గొనవచ్చు.. కానీ రష్యా మాత్రం పాల్గొనకూడదు. అదెలా అంటే.. రష్యా ఆటగాళ్లు రష్యా పేరు మీద ఆటల్లో పాల్గొనకూడదు.


అందుకే ఇప్పుడు రష్యా ఆటగాళ్లు రష్యా పేరుపై కాకుండా రష్యన్ ఒలింపిక్ కమిటీ పేరుతో ఓ కమిటీ ఏర్పాటు చేసుకుని దాని తరుపున ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. అందుకే ఇప్పుడు రష్యా ఆటగాళ్లు ROC పేరుపై ఆటల్లో పాల్గొంటున్నారు. ఈ కారణంతో రష్యా పేరు మాత్రం ఒలింపిక్స్ లో వినిపించడం లేదు. నిషేధం కారణంగా రష్యా పేరు కానీ.. పతాకం కానీ రష్యా ఆటగాళ్లు వాడేందుకు వీలు లేదు.


అందుకే ఈ విశ్వ క్రీడల ప్రారంభోత్సవంలో కూడా రష్యా పతాకం కనిపించలేదు. రష్యా ఆటగాళ్లు ఆర్వోసీ పేరుతోనే మొదటిరోజు పేరేడ్‌లో పాల్గొన్నారు. ఈ టోక్యో ఒలింపిక్స్‌లో రష్యన్ ఆటగాళ్లు సాధించే పతకాలేవీ ఆ దేశానికి చెందవు. అవన్నీ వ్యక్తిగతంగానే చెందుతాయన్నమాట. అందుకే ఈ టోక్యో ఒలింపిక్స్‌లో రష్యా ఆటగాళ్లున్నారు.. కానీ.. రష్యా మాత్రం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

roc