అధికారంలోకి రాకముందు... నాయకులు ఎన్నోఅంటారు.. అయితే అదే నాయకులకు అధికారం వచ్చాక... పాత మాటలు మర్చిపోతారు.. ఈ లక్షణం ఆ నాయకుల పట్ల గౌరవం తగ్గిస్తుంది.. వారి విశ్వసనీయతను పోగొడుతుంది.. విశ్వసనీయత అనే మాట తరచూ వాడే జగన్ సైతం.. దాన్ని కోల్పోయేలా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే.. చంద్రబాబు ప్రభుత్వం ఆరులక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని అప్పట్లో జగన్ విమర్శించారు.


కానీ..ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఆ అవినీతి గురించి రుజువు చేయలేకపోయారు. దీనికితోడు.. సొంత ఇంట్లో బాబాయ్‌ హత్యకు గురైతే నారాసుర రక్తచరిత్ర అని విమర్శించారు. కానీ.. దాన్ని కూడా రుజువు చేయలేకపోతున్నారు. ఆ ఆరోపణ నిజమైతే అధికారంలోకి వచ్చారు కాబట్టి.. చంద్రబాబుపై కేసు పెట్టి లోపలెయ్యలేకపోయారు.


ఇక అలాగే కోడికత్తి కేసు కూడా.. విశాఖ ఎయిర్‌పోర్టులో ఎవరో కోడి కత్తితో దాడి చేస్తే చంద్రబాబు చేయించాడని అప్పట్లో విమర్శించారు. కానీ.. ఈ కేసు కూడా జగన్ రుజువు చేయలేకపోయారు.  ఆ తర్వాత అనంతపురంలో కియా కార్ల పరిశ్రమ వస్తే ‘కారుమబ్బులు’ అంటూ సొంత పత్రికల్లో రాయించారు. కానీ.. అధికారంలోకి వచ్చాక అదే కియా కార్ల పరిశ్రమ రాజశేఖర రెడ్డి కారణంగా వచ్చిందని చెప్పుకున్నారు.


అంతే కాదు. ఆంధ్రప్రదేశ్‌ పౌరుల డేటాను లోకేష్‌ సన్నిహితుడి కంపెనీ చౌర్యం చేసిందని అప్పట్లో ఆరోపించారు. ఆ కేసు కూడా ఇప్పటి వరకూ తేల్చలేదు. అసలు ఇంతకూ నిజంగా పౌరుల డేటా చౌర్యం జరిగిందో? లేదో? ఇంతవరకూ తేల్చలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వాటికి జగన్ సర్కారు సమాధానం చెప్పలేకపోతే.. ఆమేరకు ఆయన విశ్వసనీయత కోల్పోతారు. అది సర్కారు మనుగడకు.. ఆయన రాజకీయ భవితవ్యానికి మంచిది కాదు.. గతంలో మనం ఏం చెప్పాం.. ఇప్పుడు ఏం చేస్తున్నాం.. అన్న విషయాలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ వెళ్లేవాడే అసలైన నాయకుడుగా నిలుస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: