పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. అవకాశం ఉన్నంత వరకూ వలసలను ప్రోత్సహిస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాక ముందు కాంగ్రెస్‌ నుంచి ఇతర పార్టీలకు వలసలు ఉండేవి.. రేవంత్ పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక.. కాంగ్రెస్‌లోకి కొందరు వలస వస్తున్నారు. గతంలో వెళ్లినవాళ్లు కూడా మళ్లీ పునరాలోచనలో ఉన్నారు. తాజాగా టీఆర్ఎస్ అమెరికా ఎన్నారై సెల్ అధ్యక్షుడు అభిలాశ్ రావ్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయన దాదాపు 12 ఏళ్లు టీఆర్ఎస్‌లో పని చేశారు.


అభిలాష్‌ రావు చేరిక సందర్భంగా రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకులకు రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టార్గెట్ ఫిక్స్ చేశారు. టీపీసీసీ చీఫ్ పోస్టు నాకు ఇవ్వడం అంటే సోనియాగాంధీ మన జిల్లాకు ఇచ్చిన గౌరవమని, నేను పాలమూరు బిడ్డని అని గర్వంగా  చెప్పుకుంటానని రేవంత్ పాలమూరు నాయకులతో అన్నారు. కాంగ్రెస్ పార్టీ మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చిందని పూర్వ జిల్లాలో 14 అసెంబ్లీ , 2 పార్లమెంట్ లలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి సోనియమ్మకు కానుకగా ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు.


ఒక్క కొల్లాపూర్ నే కాదు 14 అసెంబ్లీ , 2 పార్లమెంట్ లని కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకుంటుందన్న రేవంత్ రెడ్డి..  కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి ఎవరు ముఖ్యమంత్రి అయినా, పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ది చేసే బాధ్యత నాది  అని భరోసా ఇచ్చారు. పాలమూరు బిడ్డకి కాంగ్రెస్ లో అందరికి బి పామ్స్ ఇచ్చే అవకాశం సోనియాగాంధీ ఇచ్చిందని.. ఇప్పటివరకు ఎవరెవరికో ఓట్లు వేశాం ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ కి వేద్దామని రేవంత్ రెడ్డి అన్నారు.


కొల్లాపూర్ లో మీరంతా కష్టపడి కాంగ్రెస్ ను గెలిపిస్తే.. ఆ సన్నాసి కాంగ్రెసును మిమ్మల్ని మోసం చేసి కేసీఆర్ దగ్గర గులాం గిరి చేస్తున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో ఏ ఆడ్డమీద చూసిన పాలమూరు బిడ్డలే  కూలీలుగా ఉన్నారని.. పాలమూరు బిడ్డలు ఐఏఎస్ , ఐపీఎస్ లు కావద్దా.. బానిసలుగానే బ్రతకాలా అని ఆయన ప్రశ్నించారు. ఈ పరిస్థితి కాంగ్రెస్‌తోనే మారుతుందన్న రేవంత్.. ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: