తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఎంకే స్టాలిన్. ఇప్పటివరకు ఒక్క సారి కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం లేకపోయినప్పటికీ స్టాలిన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా ప్రజా ముఖ్యమంత్రిగా ఆయనకు పేరు తెచ్చిపెడుతుంది. పేద ప్రజలకు మేలు జరిగే విధంగా ఇప్పటికే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు ఎంకే స్టాలిన్. ఇక తమిళనాడు ప్రజలందరికీ మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా  ప్రజారంజక పాలన తో ముందుకు సాగుతున్నారు.



 ఇక ఇప్పుడు ఎంకే స్టాలిన్ తీసుకున్న నిర్ణయం పై అటు రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక కేవలం తమిళనాడు ప్రజలే కాదు ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ఇటీవలే తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఓ మహిళ పట్ల బస్ కండక్టర్ దురుసుగా ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. చేపల వ్యాపారం చేసే ఓ మహిళ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో బస్ కండక్టర్ ఆ మహిళలను అవమానించే విధంగా మాట్లాడాడు. మహిళ దగ్గర్నుంచి చేపల వాసన రావడం కారణంగా మిగతా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు అంటూ బస్ కండక్టర్ సదరు మహిళను బస్సు నుంచి కిందకు దింపేసాడు.


 దీంతో ఎంతో బాధ పడిన సదరు మహిళ తన పై వివక్ష చూపుతున్నారని న్యాయం చేయాలంటూ కోరింది. ఈ ఘటనపై ఏకంగా ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ స్పందించారు. ఆయన స్పందించిన తీరు అందరినీ ఆకర్షించింది. మహిళల అభ్యున్నతి కోసం పోరాడుతూ ఉంటే బస్సు కండక్టర్ చేసిన ఈ చర్య గర్హనీయం అంటూ వ్యాఖ్యానించారు. అందరూ సమానం అనే విశాల దృక్పథం తో పని చేయాలి అంటూ సూచించారు సీఎం ఎంకే స్టాలిన్. ఈ క్రమంలోనే రవాణా శాఖ ఉన్నతాధికారులు ఏకంగా ఆ మహిళ ఇంటికి వెళ్లి క్షమాపణలుకోరడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: