ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో నిన్న‌టి నుంచి సీజేఐ ప‌ర్య‌టించారు. నిన్న రామ‌ప్ప టెంపుల్ ద‌ర్శ‌నం చేసుకున్న సీజేఐ అక్క‌డ ప‌రిస్థితుల‌ను.. అక్క‌డి వాతావ‌ర‌ణాన్ని ఆస్వాదించారు. ఇవాళ హ‌న్మకొండ‌లోని నూత‌నంగా ఏర్పాటు చేసిన 10 కోర్టుల భ‌వ‌న స‌ముదాయాన్ని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టీస్ ఎన్వీ ర‌మణ ఆరంభించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు సీజేఐ. ముఖ్యంగా తెలంగాణ ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

కాళోజి స్పూర్తితో తెలుగులో మాట్లాడుతున్నాను అని పేర్కొన్నారు. క‌వులు, స్వాతంత్ర పోరాట యోధులు, విప్ల‌వ‌కారులు  తిరిగిన నేల వరంగ‌ల్ అని.. ఓరుగ‌ల్లుతో నాకు అవినాభావ సంబంధం ఉంద‌ని.. నాకు బంధువులు, మిత్రులు ఉన్నార‌ని  సీజేఐ స్ప‌ష్టం చేసారు. దేశానికి ప్ర‌ధానిని ప్ర‌తిపాదించిన ప్రాంతం వ‌రంగ‌ల్ అని.. నియంతృత్వ పెత్తందారి విధానాల‌కు వ్య‌తిరేకంగా సాగిన పోరాటాల‌కు ఇది పుట్టినిల్లు అని ఆయ‌న వెల్ల‌డించారు.

కోర్టుల ఆధునీక‌ర‌ణ‌తో ప్ర‌జ‌ల‌కు సత్వ‌ర న్యాయం జ‌రుగుతుంది.. శిథిలావ‌స్థ‌లో ఉన్న కోర్టుల‌ను పున‌రుద్ధ‌రించాల‌నే ల‌క్ష్యంతో ప‌ని చేస్తున్నామ‌ని.. కోర్టుల్లో మౌలిక వ‌స‌తులు ఉంటే పేద‌ల‌కు న్యాయ సేవ‌లందుతాయ‌ని పేర్క‌న్నారు. మౌలిక వ‌స‌తులు లేకుండా న్యాయ‌మూర్తులు, న్యాయవాదులు  ప‌ని చేయాల‌నుకోవ‌డం దురాశే అవుతుంద‌న్నారు. కాక‌తీయ రాజులు అందించిన ఘ‌న‌మైన వార‌స‌త్వానికి ధీటుగా హ‌న్మ‌కొండ నూత‌న కోర్టు భ‌వ‌నాలు తీర్చిదిద్ద‌బ‌డ్డాయ‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఓ ప్ర‌త్యేక‌త ఉంద‌ని.. కేంద్రం నిధులు ఇవ్వ‌క‌పోయినా.. తెలంగాణ ప్ర‌భుత్వం నిధులు ఇచ్చి కోర్టు భ‌వ‌నాల‌ను నిర్మించింద‌ని ప్ర‌శంసించారు.
 
కోర్టుల్లో సౌక‌ర్యాల కోసం ఇక అన్నీ రాష్ట్రాల నుంచి స‌మాచారం తెప్పించామ‌ని సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ వివ‌రించారు. కోర్టుల‌లో మౌలిక సౌక‌ర్యాల ప్ర‌త్యేక సంస్థ ఏర్పాటుపై జులైలో కేంద్రానికి ఇండియ‌న్ జ్యూడిషియ‌రీ ఇన్‌ప్రాస్ట్ర‌క్ష‌ర్ కార్పొరేష‌న్ ఏర్పాటు పై ప్ర‌తిపాద‌న పంపామ‌ని, ఆధునీక‌ర‌ణ ద్వారా స‌త్వ‌ర‌మే న్యాయం అందించ‌గ‌లం అని చెప్పిన‌ట్టు గుర్తు చేసారు. న్యాయ మంత్రిత్వ శాఖ‌, కేంద్రం నుంచి స‌మాధానం రావాల‌ని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్ర‌త్యేక సంస్థ‌పైపార్ల‌మెంట్ స‌మావేశాల‌లో చ‌ట్టం రూపంలో తెస్తారు అని ఆశిస్తున్నట్టు సీజేఐ స్ప‌ష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: