
నిజానికి ఓవరాక్షన్ రెండువైపులా జరిగింది. తప్పు ఇద్దరిలోను ఉంది. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. ఇదికూడా అంతే. ఇంతకీ విషయం ఏమిటంటే విజయనగరం జిల్లాలోని రామతీర్ధం బోడికొండ దేవాలయం పున: నిర్మాణ కార్యక్రమం శంకుస్ధాపన జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత, ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు అక్కడికి వచ్చారు. శంకుస్ధాపన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్ధితి చోటు చేసుకుంది.
జరిగిన ఘటన అందరికీ పైకి కనిపించేది మాత్రమే. కానీ తరచి చూస్తే ఇటు ప్రభుత్వం వైపునుండే కాకుండా అటు రాజుగారి వైపు నుండి ఇగో ప్రాబ్లెమ్ బాగానే కనిపిస్తుంది. ప్రభుత్వంపై కేసుల మీద కేసులు వేసి తన హక్కులను సాధించుకోవాలని అశోక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఎక్కడ దొరికితే అక్కడ అశోక్ ను అవమానించాలని ప్రభుత్వం తెగ ప్రయత్నిస్తోంది. ఇపుడు శంకుస్ధాపన కార్యక్రమాన్నే తీసుకుంటే ఆలయ ధర్మకర్తగా అశోక్ కు చెప్పకుండా ప్రభుత్వం చేయకూడదు.
ఇదే సమయంలో ప్రభుత్వం శంకుస్ధాపన కార్యక్రమం పెట్టుకుంటే దాన్ని అశోక్ కూడా అడ్డుకోకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే కార్యక్రమం గురించి చెప్పటానికి ఆలయ అధికారులు, ప్రధానపూజారి వెళ్ళినపుడు రాజుగారు తిట్టి పంపేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకంలో రాజుగారి పేరు కూడా ఉంది. పెద్దమనిషిగా పేరున్న అశోక్ కావాలనే అక్కడ ఇంతటి రబస చేశారని అర్ధమైపోతోంది. ఏడాది క్రిందట దేవాలయంలో విగ్రహాలను కూల్చేసిన ఘటనలో ప్రభుత్వం ఇప్పటికీ నిందితులను పట్టుకోలదంటు అశోక్ పెద్ద గొడవేచేశారు. సరిగ్గా శంకుస్ధాపన సమయంలోనే అశోక్ కు ఈ విషయం గుర్తుకొచ్చిందా ?
ప్రతిపక్షంలోని నేత ప్రభుత్వంలో తన అధికారాలను చెలాయించాలని చూస్తే సాధ్యమేనా ? ఆలయ ధర్మకర్త హోదాలో అశోక్ కు తెలియకుండా శంకస్ధాపన కార్యక్రమం పెట్టుకోవటం ప్రభుత్వానిది తప్పే. తనను ఆహ్వానించటానికి వచ్చిన వాళ్ళని తిట్టి పంపయటం రాజుగి తప్పు. ఈ నేపధ్యంలో అశోక్ అక్కడకొచ్చి గొడవ చేసి సాధించేదేముంటుంది ? కార్యక్రమం అయిపోయిన తర్వాత తాను చెప్పదలచుకున్నదేదో మీడియా సమావేశంలో చెబితే సరిపోతుంది. అప్పుడు జనాల్లో అశోక్ కు సింపతి పెరగటమే కాకుండా ప్రభుత్వాన్నే తప్పుపట్టేవారు.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే వైసీపీ తరపున గెలిచిన మేయర్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్ల విషయంలో ఎలా వ్యవహరించిందో రాజుగారికి తెలీకుండానే ఉంటుందా. మేయర్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్లకు తెలీకుండానే సమావేశాల తేదీలను కమీషనర్లే డిసైడ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రజాస్వామ్యం ముసుగులో జరగకూడనివన్నీ జరిగిపోతున్నాయి. దానికి టీడీపీ, వైసీపీ మినహాయింపులేమీ కావు. అప్పుడు టీడీపీ చేసుకున్నపద్దతిలోనే ఇపుడు వైసీపీ చేసుకుపోతోందంతే. స్ధూలంగా చూస్తే ఉంటే ఇద్దరిదీ తప్పుంది లేకపోతే ఇద్దరిలోను లేదంతే.