ఎప్పటికైనా కాపునేతల కోరిక తీరుతుందా ? అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నయిపోయింది. ఈ ప్రశ్నకు సమాధానం వెతికేందుకే ఈనెల 2వ వారంలో వైజాగ్ లో కాపు ప్రముఖులు సమావేశమవుతున్నారు. కాపులంతా ఐక్యంగా ఉండాలి, కాపులకు ప్రత్యేకంగా ఒకపార్టీ ఉండాలి, కాపు నేతే ముఖ్యమంత్రి అవ్వాలి అనేది చాలా కాలంగా కాపు పెద్దల కోరిక. అయితే అది తీరే మార్గం మాత్రం ఎక్కడా కనబడటంలేదు. ఎందుకంటే కాపుల్లో ఐక్యత చాలా చాలా తక్కువ. పైగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు మరికొన్ని చోట్ల కాపులకు బీసీలకు ఏమాత్రం పడదు.
సమాజంలో కాపుల జనాభా సుమారుగా 19 శాతం ఉంటుందని లెక్క చెబుతున్నారు. నిజంగా ఇంత శాతం ఉన్న తర్వాత వాళ్ళదే రాజ్యాధికారం కావాలి. కానీ ఎందుకు వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి దక్కటంలేదు ? ఇదే ప్రశ్నే చాలామందిని పట్టి పీడిస్తోంది. కాపులు ఒక గొడుగు కింద ఎప్పటికీ రాలేరు. ఎవరికి తోచిన పార్టీల్లో వాళ్ళు అడ్జస్టయిపోయారు. కాపులంతా ఒకేగొడుగు కిందకు రావాలంటు ముందు వివిధ పార్టీల్లో ఉన్న ప్రజాప్రతినిధులంతా పదవులకు, పార్టీకి రాజీనామాలు చేయాలి. ఇది జరిగేపనికాదని అందరికీ తెలుసు.
పైగా రాష్ట్రంలోని కాపులందరినీ ఏకతాటిపైన నిలిపేంత సత్తా ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఆపని చేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి చాలామందిని నట్టేటముంచి తనదారి తాను చూసుకున్నారు. చిరంజీవి ఏదో ఉద్ధరించేస్తారని నమ్మి ప్రజారాజ్యంపార్టీలో చేరిన వాళ్ళలో చాలామంది ముణిగిపోయారు. చిరంజీవి దెబ్బ గుర్తుకొచ్చే కాపుల్లో చాలామంది పవన్ కల్యాణ్ దగ్గరకు రావటానికే భయపడుతున్నారు. ఈ పరిస్ధితుల్లో ఇక కాపులకు ప్రత్యేకంగా పార్టీ ఎవరు పెడతారు ? రాజ్యాధికారం ఎలావస్తుంది ?
కాపులముందున్న మార్గం ఒకటే. జనసేనలో చేరి పవన్ను బలోపేతం చేయటం. అయితే పవన్ను చాలామంది కాపులు నమ్మటంలేదు. ఎందుకంటే సామాజికవర్గాన్ని చూసుకుని తాము పవన్ను బలోపేతం చేస్తే పవన్ వెళ్ళి చంద్రబాబునాయుడుతో చేరుతారనే అనుమానాలు బలంగా ఉన్నాయి. తామెంత కష్టపడినా, పవన్ ఎంత ఆయాసపడినా సీఎం అయ్యేది మాత్రం చంద్రబాబే అనే విషయం కాపుల్లో పిచ్చ క్లారిటి ఉంది. చంద్రబాబును సీఎం చేయటానికి తామెందుకు పవన్ కు మద్దతుగా ఉండాలనే భావన కాపునేతల్లో ఉంది. మరిన్ని సమస్యలు, ప్రశ్నలు, అనుమానాలతో కాపునేతల కోరిక ఎప్పుడు తీరుతుందో ?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి