ఆమధ్య పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసి వివాదాల్లో చిక్కుకున్న పోసాని కృష్ణమురళి, మరోసారి అలాంటి వివాదానికే కారణం అయ్యారు. ఈసారి వేదిక సీఎం జగన్ కార్యాలయం కావడం విశేషం. సీఎం జగన్ తో చిరంజీవి బృందం సినిమా టికెట్ల వ్యవహారంపై భేటీ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే దీనికి శుభం కార్డు పడుతుందని ఇరు వర్గాలు పేర్కొన్నాయి. అక్కడితో ఆ సమస్య తీరిపోయినట్టేనని అనుకున్నారంతా. కానీ లోపల జరిగిన చర్చల్లో పోసాని హాట్ డిస్కషన్ గురించి ఇప్పుడిప్పుడే లీకులు వస్తున్నాయి.

సీఎం జగన్ తో సినీ బృందం భేటీకి పోసాని కృష్ణమురళి కూడా వచ్చారు. లోపల చర్చల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత బయటకొచ్చి అందరూ మీడియాతో మాట్లాడారు. అక్కడ పోసాని లేరు, పోసాని అప్పటికే అక్కడినుంచి వెళ్లిపోయారని సమాచారం. లోపల చర్చల్లో ఉన్న ఆయన, బయట అందరితో ఎందుకు కలవలేదు, మీడియా ముందు ఆయన ఎందుకు మాట్లాడలేదు.. ? మొదట్లో దీనికి కారణం పవన్ కల్యాణ్ వ్యవహారం అనుకున్నారంతా. గతంలో పవన్ పై పోసాని ఘాటు వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడు చిరంజీవి ముందు ఆయన మాట్లాడలేక పక్కకు వెళ్లిపోయారని అనుకున్నారు.

కానీ సీఎంతో జరిగిన మీటింగ్ లో కూడా పోసాని ఫైర్ అయ్యారని తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ బయటకు రాని ప్రభాస్, మహేష్ బాబు కూడా ఈసారి సీఎంతో మీటింగ్ కి వచ్చారు. ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ పోసాని మీటింగ్ లో మాట్లాడారని అంటున్నారు. కష్టం వచ్చినప్పుడే హీరోలు బయటకు వచ్చారని పోసాని అన్నారట. దీంతో అక్కడే ఉన్న సినీ పెద్దలు ఆయన్ను వారించారట. పోసాని వ్యాఖ్యలు కాస్త ఘాటుగా ఉండటంతో.. ఆయన్ను అక్కడినుంచి పంపించేశారని తెలుస్తోంది. తాను చెప్పాలనుకున్నది చెప్పి పోసానే నేరుగా బయటకు వెళ్లిపోయారని కూడా మరో వర్గం చెబుతోంది. మొత్తమ్మీద సీఎం దగ్గర జరిగిన చర్చల్లో పోసాని తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఆ తర్వాత ఎలాగూ మిగతా వాళ్లంతా బయటకొచ్చి ముఖ్యమంత్రిని పొడిగే కార్యక్రమం పెట్టుకుంటారు కాబట్టి, అక్కడ తానెందుకంటూ పోసాని బయటికొచ్చేసినట్టు తెలుస్తోంది. మీటింగ్ లో ఉన్న పోసాని, ప్రెస్ మీట్ కి లేకపోవడానికి కారణం అదేనంటున్నారు. మొత్తమ్మీద మరోసారి పోసాని సీఎం సమక్షంలోనే కాస్త ఘాటుగా స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: