వారాహి యాత్ర మొదలైన దగ్గరనుండి చంద్రబాబునాయుడుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ షాకుల మీద షాకులిస్తునే ఉన్నారు. అసలు వారాహి యాత్ర జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మొదలుపెట్టారా లేకపోతే చంద్రబాబుకు వ్యతిరేకంగా మొదలుపెట్టారో జనాలకు అర్ధంకావటంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే పిఠాపురంలోని పట్టురైతులు, చేనేత కార్మికుల సమావేశంలో మాట్లాడుతు ముఖ్యమంత్రిగా తనకు ఒక్క అవకాశం ఇవ్వమని రిక్వెస్టుచేశారు. తనకు ఒక్కఛాన్సిస్తే ప్రజల జీవితాల్లో మార్పుతెస్తానన్నారు. ఆచరణసాధ్యంకాని హామీలిచ్చేది లేదని గట్టిగా చెప్పారు.





ప్రభుత్వం స్ధాపించిన రెండేళ్ళల్లో ప్రజల సంతృప్తిమేరకు పరిపాలన చేయలేకపోతే వెంటనే ముఖ్యమంత్రిగా దిగిపోతానని స్పష్టంగా ప్రకటించారు. 2024 ఎన్నికల్లో జనసేనను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను పవన్ రిక్వెస్టుచేశారు. పిఠాపురంలో పవన్ ఎంతసేపు మాట్లాడినా జనసేనకు అధికారం ఇవ్వండి, తనను ముఖ్యమంత్రిని చేయండనే చెప్పారు. పొరబాటున కూడా టీడీపీతో పొత్తు, చంద్రబాబు, కూటమి అనే మాటలను ఎక్కడా  ప్రస్తావించలేదు. ఇక్కడే పవన్ వైఖరి ఏమిటో తమ్ముళ్ళకు అర్ధమవుతున్నట్లు లేదు.





మొన్నటివరకు టీడీపీతో పొత్తుంటుందని, చంద్రబాబే ముఖ్యమంత్రని అర్ధమొచ్చేట్లుగా మాట్లాడారు. తమ కూటమితరపున సీఎం అభ్యర్ధిగా ప్రకటించమని అడగటానికి కూడా తనకు అర్హతలేదని తనను తానే డీ గ్రేడ్ చేసుకున్నారు. అలాంటిది యాత్ర మొదలైనప్పటినుండి జనసేనను అధికారంలోకి తీసుకురండి, తనను ముఖ్యమంత్రిని చేయండని పదేపదే అడుగుతున్నారు. పైగా కత్తిపూడి బహిరంగసభలో మాట్లాడినపుడు ఒంటరిగా పోటీచేస్తానో లేకపోతే సమూహంతో కలిసి పోటీచేస్తానో ఇంకా డిసైడ్ చేసుకోలేదన్నారు.





పరస్పర విరుద్ధమైన ప్రకటనలు, డిమాండ్లతో పవన్ తమ్ముళ్ళల్లో అయోమయం పెంచేస్తున్నట్లు కనబడుతోంది. ఒకవేళ ఇదంతా వ్యూహాత్మకమే అయితే తనను సీఎంను చేయండని ఇపుడు అడుగుతు ఎన్నికల సమయంలో చంద్రబాబే ముఖ్యమంత్రని చెబితే ఎవరైనా పవన్ను నమ్ముతారా ? కూటమికి ఓట్లేస్తారా ? ఇంతకాలం మాట్లాడని మాటలను హఠాత్తుగా వారాహియాత్ర మొదలైనప్పటినుండే ఎందుకు మాట్లాడుతున్నారో ఎవరికీ అర్ధంకావటంలేదు. ఒకసారి చంద్రబాబు సీఎం అంటారు. మరోసారి తానే సీఎం అంటారు. రెండేళ్ళ తర్వాత జనాలు వద్దంటే దిగిపోతానని చెబుతున్న పవన్ కు అసలు సీఎంగా అవకాశం ఇచ్చేదెవరో అర్ధంకావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: