121 మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల పట్టాలతో పాటు తాళాలను అందజేశారు. అలెప్పీలోని హోటల్ కేమ్లాట్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. ఆ సమయంలో కేరళ సీఎం పినరయి విజయన్ సైతం రామోజీ రావును ప్రశంసించడంతో పాటు సంకల్పం బలంగా ఉన్నందునే ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని కామెంట్లు చేయడం జరిగింది.
బాధితులను ఆదుకున్నందుకు రామోజీ గ్రూప్ కు ఆయన మనస్పూర్తిగా అభినందనలు తెలియజేశారు. ఆ సమయంలో వరద సహాయ కార్యక్రమాల్లో ముఖ్య పాత్ర పోషించిన యంగ్ ఐఏఎస్ మైలవరపు కృష్ణతేజను సైతం సీఎం మెచ్చుకున్నారు. భవిష్యత్తులో సైతం కేరళ ప్రభుత్వ సంబంధిత కార్యక్రమాల్లో రామోజీ గ్రూప్ భాగ్యస్వామ్యం అవుతుందని భావిస్తున్నామని ఆయన వెల్లడించారు.
గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో భూకంపం, ఒడిశాలో సూపర్ సైక్లోన్, తమిళనాడులో సునామీ, విశాఖలో హుధ్ హుధ్ వచ్చిన సమయంలో సైతం రామోజీ గ్రూప్ అండగా నిలబడి తమ వంతు సహాయం అందజేసింది. కేరళ వరదల్లో సర్వం కోల్పోయిన వారికి అండగా నిలబడటానికి రామోజీ గ్రూప్ ముందుకొచ్చింది. ఆ సమయంలో రామోజీ గ్రూప్ చేసిన సహాయం ఎన్నో కుటుంబాల్లో సంతోషం నింపింది. రామోజీ రావు ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో చేసిన సహాయాన్ని మాత్రం సులువుగా మరిచిపోలేము. రామోజీ రావు వ్యాపారవేత్తగానే కొనసాగినా ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రతి సందర్భంలో ఆయన తన వంతు సహాయం చేశారు.