తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిమ పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కుమార్తె ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు రాసిన ఆరు పేజీల లేఖ నిన్న లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ లేఖ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ లేఖ పై బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. లేఖలో పార్టీకి సంబంధించి పలు విషయాలపై కవిత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కనిపించింది. మరోవైపు లేఖను ఎవరు లీక్ చేశారనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. 

కేటీఆర్, కేసీఆర్ ఇప్పటివరకు ఈ లేఖ గురించి స్పందించలేదు. అయితే ప్రస్తుతం కవిత అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమారుడి గ్రాడ్యుయేషన్ డే కోసం కవిత తన భర్తతో కలిసి అమెరికాకు వెళ్లారు. ఇప్పుడు ఆమె శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో కవిత మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అయితే కవిత హైదరాబాద్ కు విచ్చేస్తున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్దకు భారీగా పార్టీ శ్రేణులు చేరుకున్నారు. 

అక్కడ అసలు బీఆర్ఎస్ పేరు లేకుండా కవితకు స్వాగతం పలికే బ్యానర్లు దర్శనమిచ్చాయి. అభిమానులు కేవలం కవిత కటౌట్లను మాత్రమే తీసుకొచ్చారు. ఎక్కడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కటౌట్స్ కనిపించలేదు. అంతేకాకుండా గులాబీ పార్టీ జాగృతి జెండాలు కూడా కనిపించకపోవడం విశేషం. మరోవైపు టీం కవితక్క అంటూ అభిమానులు భారీ కటౌట్ లు ఏర్పాటు చేశారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవితక్కకు స్వాగతం అంటూ అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో అతి త్వరలోనే కవిత బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతారని సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మాజీ సీఎం కూతురు ఎమ్మెల్యే కవిత కొత్త పార్టీని స్థాపిస్తారా లేదంటే ఏదైనా పార్టీలో చేరుతారా అనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: