
ఆ మేరకు విద్యారంగంలో అధునాతన సాంకేతికతను అమలుచేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి ఎపి విద్యాశాఖ, టోనీబ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (టిబిఐ) నడుమ 2024 డిసెంబర్ లో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా టిబిఐ విజయవాడలో తమ ఎంబెడెడ్ బృందాన్ని మొహరించి రెండు ప్రధాన అంశాలపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తోంది. అందులో 1). ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యలో సంస్కరణలు 2). గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్థాపన. ఎపి విద్యాశాఖ, టిబిఐ నడుమ ఒప్పందం తర్వాత ఏ మేరకు పురోగతి సాధించారనే అంశంపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టిబిఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు.
గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (GiGG) సలహాబోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లెయిర్ ను మంత్రి లోకేష్ ఈ సందర్భంగా ఆహ్వానించారు. నైపుణ్య శిక్షణ అంశాలు మరియు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపన కు సహకారం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆగస్టులో విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్ కు TBI భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లెయిర్ అన్నారు. ఈ సమావేశంలో విద్య శాఖ కార్యదర్శి కోన శశిధర్, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు పాల్గొన్నారు.