
ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల.. తాజాగా ఇచ్చిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఎలా ఉన్నా.. సొంత పార్టీలోనే పెదవి విరుపులు కనిపించాయి. కొత్తవారు పార్టీలోకి రావాలని.. ఎమ్మెల్యే సీట్లు ఇప్పించే బాధ్యత నాదేనని షర్మిల చేసిన వ్యాఖ్యలు పార్టీలో వైరల్ అయ్యాయి. సహజ రాజకీయ వ్యాఖ్యలకు భిన్నంగా.. షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కూడా రేపాయి. యువతను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అంతేకాదు.. ధనవంతులు, రిసోర్సెస్ ఉన్నవారు పార్టీలోకి రావాలని.. ఇదే మంచి సమయమని కూడా చెప్పారు. తనను చూసి రావాలని కూడా ఆమె పిలుపునిచ్చారు.
అంతేకాదు.. ఎన్నికలకు ముందు వస్తే.. అప్పుడు టికెట్లపై తాను హామీ ఇవ్వలేనన్న షర్మిల.. ఇప్పుడే మంచిఅవకాశమని పేర్కొన్నారు. తద్వారా పార్టీలో కొత్తరక్తం పెంచుకునేందుకు షర్మిల కృషి చేశారు. దీనిని ఎవరూ తప్పుపట్టనవసరం లేదు. అయితే.. కొత్తవారి మాట పక్కన పెడితే.. అసలు.. ఇప్పటి ఉన్న వారి మాటేంటన్నది ప్రశ్న. ఎందుకంటే.. కాంగ్రెస్‌లో నాయకు లకు కొదవ లేదు. కార్యకర్తలకు కూడా కొరత లేదు. సీనియర్లు, పాత కాపులు చాలా మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్నారు.
అయితే.. వీరిని నడిపించే నాయకులు కరువయ్యారు. షర్మిల తాజాగా తనపై నమ్మకం ఉంచి కొత్తవారు రావాలని పిలుపుని చ్చారు. కానీ.. వాస్తవానికి ఇప్పుడుఉన్న వారిలో ఎంత మంది నమ్మకంతో ఉన్నారన్నది ప్రశ్న. ఎందుకంటే.. అనంతపురం, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో నాయకులు ఉన్నా.. షర్మిలపై నమ్మకం లేదన్నది బాహాటంగానే వినిపిస్తున్న విమర్శ. అంతేకాదు.. షర్మిలకు వ్యతిరేకంగా క్యాంపులు పెడుతున్నారు. ఆమె జిల్లా పర్యటనలు కూడా బాయ్ కాట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లా పర్యటనను తూ..తూ.. మంత్రంగా ముగించారు.
దీనిని బట్టి పాత కాపులకు నమ్మకం కలిగించేలా షర్మిల వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా.. కొత్తవారిని పిలిచినా.. వచ్చేందుకు ఎవరు మాత్రం ముందుకు వస్తారు? అనేది ప్రశ్న. పైగా.. రిసోర్సెస్ ఉండి.. రూపాయి ఖర్చు పెట్టుకుంటే.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని షర్మిల ఆఫర్ ఇచ్చారు. ఇంత చేసేందుకు నాలుగేళ్ల ముందే.. ఎవరు మాత్రం సాహసిస్తారు? పైగా బలమైన కూటమి, మరోవైపు.. వైసీపీ దూకుడు కారణంగా కాంగ్రెస్ వైపు ప్రజలు ఏమేరకు మొగ్గు చూపుతారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
సో.. ఎలా చూసుకున్నా.. షర్మిల ప్రకటన ప్రయాసే తప్ప.. ఫలితం కనిపించడం కష్టమేనని అంటున్నారు. ఇక, తాజాగా చేపట్టిన రెండు మూడు సర్వేల్లో ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పారట్ఈ గ్రాఫ్ ఏమాత్రం పెరగక పోగా.. షర్మిల గ్రాఫ్ వ్యక్తిగతంగా మరింత తగ్గిందని తేలింది. ఇలాంటిపరిస్థితిలో షర్మిల పిలుపు ఏమేరకు ఫలితం ఇస్తుందన్నది చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు