
"నాకు, నా పార్టీకి కేసీఆర్ మాత్రమే తిరుగులేని నాయకుడు. ఆయన స్థానాన్ని భర్తీ చేసే శక్తి ఇంకెవరికీ లేదు," అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు సాధారణమైనవి కావు. ఇది కేటీఆర్ నాయకత్వాన్ని ఆమె అంగీకరించడం లేదన్న దానికి నిలువెత్తు నిదర్శనం. 'మా నాన్నతో సమానం కాదు, ఆయన కంటే ఎక్కువ కాదు' అని చెప్పడం ద్వారా.. కేటీఆర్ సీఎం అభ్యర్థిత్వంపై తనకున్న వ్యతిరేకతను, అసంతృప్తిని పరోక్షంగా వెళ్లగక్కారు. ఇది కేవలం అన్న మీద అలక కాదు, అధికారం కోసం వేస్తున్న వ్యూహాత్మక అడుగు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు తన తండ్రి తనకు ప్రత్యేక నిధులు ఇవ్వలేదని గుర్తుచేసుకుంటూనే, "ఎప్పటికైనా నేను ముఖ్యమంత్రిని అవుతా" అని కవిత ధీమాగా ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇది కేవలం ఆషామాషీ వ్యాఖ్య కాదు. పార్టీ పగ్గాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం తనకు కూడా కావాలనే బలమైన ఆకాంక్షకు ఇది అద్దం పడుతోంది. కేటీఆర్‌కు పోటీగా తాను కూడా అధికార రేసులో ఉన్నానని ఆమె స్పష్టమైన సంకేతాలు పంపారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన తండ్రి కేసీఆర్‌కు ఎలాంటి పాత్ర లేదని క్లీన్‌చిట్ ఇస్తూనే, కవిత మరో సంచలన ఆరోపణ చేశారు. "నా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి" అని చెప్పడం ద్వారా అసలు అనుమానాలన్నీ కేటీఆర్ వైపు మళ్లించారు. ఆంధ్రాలో తన అన్న జగన్‌పై షర్మిల చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలనే, ఇప్పుడు తెలంగాణలో కవిత తన అన్నపై చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ మొదలైంది. ఈ వ్యాఖ్యలతో కవిత 'తెలంగాణ షర్మిల'గా మారారని, కుటుంబంలోనే అధికార పోరు తీవ్రస్థాయికి చేరిందనడానికి ఇదే నిదర్శనమని విశ్లేషిస్తున్నారు.