
ఇది కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా, ప్రతిపక్షానికి అందులో చురకలు వేసే అవకాశం ఇచ్చింది. దీంతో, ప్రజలు మరిచిపోయిన పథకాన్ని మళ్ళీ జ్ఞప్తికి తెచ్చి మళ్లీ కొత్త దుమారానికి దారితీసారంటూ పార్టీ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది రాజకీయ పరిపక్వత చూపించాల్సిన నేతల నుంచి రావడం ఆశ్చర్యంగా మారింది. ఇక మరో మంత్రి నారాయణ వ్యవహారశైలి కూడా చర్చనీయాంశమవుతోంది. అమరావతి నిర్మాణాల్లో భాగంగా ఓ ఇంజనీర్‌పై "స్టుపిడ్", "యూజ్‌లెస్ ఫెలో", "గెట్ అవుట్" వంటి పదాలను వాడిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చదువుకున్న, మౌలిక రంగాల్లో అనుభవం ఉన్న మంత్రి నారాయణ ఈ రీతిలో మాట్లాడడం మేధావులకే కాదు, పార్టీ శ్రేణులకు కూడా విస్మయం కలిగిస్తోంది.
ఈ రెండు ఘటనలు చూస్తే.. చంద్రబాబు చెప్పే క్రమశిక్షణను ఫాలో అవ్వాల్సిన మంత్రులు… సూటిగా మాట్లాడుతూ దూకుడుతో వ్యవహరించడం వల్ల పార్టీకి ప్రతికూలత ఏర్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. రాజకీయాల్లో మాటలు ఓ ఆయుధం. వాటిని ఎలా, ఎప్పుడు వాడాలో తెలియాలి. ఒక పార్టీకి ప్రభుత్వానికి ప్రతిష్ట ముఖ్యం. మంత్రుల మాటలు ప్రజల్లో రిప్రజెంటేషన్‌లా మారుతాయి. మరి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రులు గమనిస్తారా? తమ నోటి మాట వల్ల వచ్చే ప్రభావాన్ని ముందే అంచనా వేస్తారా? లేక ఇలాగే మాట్లాడుతూ పార్టీకి కాస్త మైనస్ తెచ్చేస్తారా అన్నది చూడాల్సిన విషయం. కానీ ఒక విషయం ఖాయం – సర్కారుకు మద్దతుగా నిలవాల్సిన మంత్రులే తమ మాటలతో ఇబ్బందులు తెచ్చేస్తే… ప్రతిపక్షానికి వేదిక సిద్ధమైపోతుంది.