- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సింగపూర్ పర్యటనకు వెళుతున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీ.జీ. భరత్ కూడా వెళ్తున్నారు. సుమారు ఆరు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 30 మందితో కూడిన అధికార బృందం సింగపూర్ వెళ్లనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి అక్కడి పారిశ్రామికవేత్తలు, ఆర్థిక ప్రతినిధులతో సమావేశమై అమరావతి రాజధాని అభివృద్ధి సహా రాష్ట్రానికి పెట్టుబడుల రాకపై చర్చించనున్నారు. చివరిసారిగా చంద్రబాబు ఈ ఏడాది ప్రారంభంలో దావోస్ పర్యటనలో పాల్గొన్నారు. అప్పట్లో పెద్ద ఎత్తున పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల ఫలితంగా ఇప్పటివరకు ఏ కంపెనీ ఏపీకి రావడం లేదన్నది ప్రతిపక్షాల వాదన. ఈ నేపథ్యంతో సింగపూర్ పర్యటన జరగడం, దీనికి సంబంధించి సుమారు 40-50 కోట్ల ఖర్చు చేస్తుండడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ప్రభుత్వం దీనిపై అధికారికంగా స్పందించకపోయినా, సామాజిక మాధ్యమాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వైసీపీ వర్గాలు చంద్రబాబు విదేశీ పర్యటనలను అవిశ్వాసంతో చూస్తున్నాయి. వారి ప్రకారం, గతంలో కూడా ఇలాంటి పర్యటనల ద్వారా ప్రత్యక్ష లాభం రాష్ట్రానికి రాలేదన్నది ప్రధాన విమర్శ. అయితే, అధికార పార్టీ వర్గాలు మాత్రం ఈ పర్యటన వెనుక వ్యూహాత్మక ప్రయోజనాలున్నాయని చెబుతున్నాయి. చంద్రబాబు పర్యటన వెనుక ప్రధాన ఉద్దేశ్యం అమరావతికి పెట్టుబడులను ఆకర్షించడమే. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సింగపూర్ ప్రభుత్వ మద్దతుతో అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఆ అనుబంధాన్ని మళ్లీ తెరపైకి తెచ్చేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు. వైసీపీ పాలన సమయంలో అమరావతిపై అభివృద్ధి పనులు నిలిచిపోయిన ప‌నులు స్పీడ‌ప్ కావాల‌న్న‌దే ఈ పర్యటనలో ముఖ్య లక్ష్యం.


ప్రస్తుతం సింగపూర్ నుంచి భారీగా పెట్టుబడులు రప్పించాలన్న ధ్యేయంతో ముఖ్యమంత్రి వివిధ సమావేశాల్లో పాల్గొననున్నారు. వైసీపీ రాజధానిని అడ్డుకునే విధంగా విదేశీ పెట్టుబడిదారులపై ప్రణాళికాబద్ధంగా ఒత్తిడి తెచ్చిందన్న ఆరోపణల నేపథ్యంలో, చంద్రబాబు వ్యక్తిగతంగా ఈ విషయం లో స్పష్టత ఇవ్వాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో పి-ఫోర్ పథకం కింద ప్రవాసాంధ్రులను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుగా మారుస్తూ, వారిని గ్రామాల దత్తత కార్యక్రమాల్లో భాగస్వాములుగా చేర్చాలన్న లక్ష్యం ఉంది. ఫైన‌ల్‌గా ఈ సింగపూర్ పర్యటన చంద్రబాబు ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. ఒకవైపు పెట్టుబడులు, మరోవైపు రాజధాని అభివృద్ధిపై స్పష్టత ఇవ్వాలన్న లక్ష్యంతో జరగనున్న ఈ పర్యటనపై విమర్శలు ఉన్నా... రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా ఈ పర్యటన ఏ విధంగా ఫలితాలు ఇస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: