వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్య‌వ‌హారం ప్రస్తుతం రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఆయన కేంద్రంలోని ఎన్‌డీఏ కూటమితో నేరుగా సంబంధం లేకుండా, తటస్థంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కలిగింది. అయితే తాజా పరిణామాలు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్‌కు మద్దతు ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా జగన్‌ను సంప్రదించడం, జగన్ కూడా వెంటనే ఓకే చెప్పడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. వాస్తవానికి ఎన్‌డీఏలో అధికారిక భాగస్వామ్యం వైసీపీకి లేదు. కేంద్రంలో ఉన్న ఇండియా ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ బలమైన మద్దతు ఇస్తోంది.


టిడిపి - వైసిపి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు కేంద్రం నేరుగా జగన్‌ను సంప్రదించడం, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కనీసం సమాచారం ఇవ్వకపోవడం అనేది అనూహ్య పరిణామం. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం అనేది జగన్ నిర్ణయం కావొచ్చు, కానీ రాష్ట్రంలో అధికారికంగా ఎన్‌డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీని పట్టించుకోకపోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామం వెనుక మరొక కోణం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో లిక్కర్ స్కాం, అవినీతి కేసుల నేపథ్యంలో జగన్ అరెస్టు అవకాశం ఉందని, కానీ కేంద్రంలోని పెద్దలే వెనకాడుతున్నారని చర్చ సాగుతోంది. లేకపోతే ఇప్పటికీ ఆయనపై కఠిన చర్యలు జరిగిపోయేవని అంటున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో నేరుగా జగన్‌ను సంప్రదించడం మరింత అనుమానాలకు తావిస్తోంది.


ఈ పరిణామాలన్నీ టిడిపిలో కలవరం రేపుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబుకు సమాచారం ఇవ్వకపోవడం, కేంద్రం తీరుపై ఆయన ఏ విధంగా స్పందిస్తారు అన్నది కీలకంగా మారింది. ఈ విషయాన్ని లైట్‌గా తీసుకుంటారా లేక పెద్దలతో నేరుగా చర్చిస్తారా అనేది చూడాలి. కానీ ఒక విషయంలో మాత్రం టీడీపీ నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రజలకు సరైన సంకేతాలు ఇవ్వవు, కూటమి భాగస్వామ్యంలో అనుమానాలు పెంచుతాయంటున్నారు. మొత్తానికి, జగన్ తీరుతెన్నులు, కేంద్రం చూపుతున్న ప్రత్యేక దృష్టి, టీడీపీని పక్కన పెట్టిన తీరు అన్నీ క‌లిసి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకువచ్చాయి. ఇవి రాబోయే రోజుల్లో ఏపీలో రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: