విశాఖ ఉక్కు కర్మాగారం అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రైవేటీకరణ నిర్ణయాలు, యాజమాన్యం తరచూ జారీ చేస్తున్న నోటిఫికేషన్లు ఉద్యోగులు, కార్మికుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. గత రెండు సంవత్సరాలుగా నిరంతర ఉద్యమాలు జరుగుతున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకలేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించగా, ఇటీవల షర్మిల నిరాహార దీక్ష చేపట్టడం, ఆమెను పోలీసులు అడ్డుకోవడం పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడు ఈ ఉద్యమాన్ని వైసీపీ భుజాన వేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల విశాఖ ఉక్కు యాజమాన్యం ఒకేసారి 34 కీలక విభాగాలను ప్రైవేటీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. మైనింగ్ సహా అనేక విభాగాలను ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించబోతున్నారని తెలిసి కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు విభాగాలు ప్రైవేటీకరణ దిశగా వెళ్ళగా, ఇప్పుడు మరోసారి పెద్ద ఎత్తున చర్యలు మొదలవ్వడం ఉద్యమానికి ఊపునిస్తోంది.


ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ ఒకరు ఉద్యోగ సంఘాల ప్రతినిధులను కలసి, “ఉక్కు కార్మికుల వెన్నంటి ఉంటాం, ఉద్యమాన్ని మరింత బలంగా చేస్తాం” అని హామీ ఇచ్చారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా కాకుండా, పార్టీ తరఫుననే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పడం గమనార్హం. అయితే స్థానికంగా ఇదే ప్రశ్న తలెత్తుతోంది. వైసీపీ హయాంలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించిన నిర్ణయాలు మొదలయ్యాయి. అప్పట్లో జగన్ కేవలం లేఖలు రాసి, కేంద్రాన్ని సుతిమెత్తగా కోరడం మినహా మరో కఠినమైన చర్యకు వెళ్ళలేదు. ఇప్పుడు మాత్రం ఏకంగా ఉద్యమానికి మద్దతు ఇస్తామని ప్రకటించడం వెనక స్పష్టంగా రాజకీయ లెక్కలు ఉన్నాయన్నది చర్చనీయాంశమైంది.


వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, విశాఖ ఉక్కు అంశాన్ని వైసీపీ తన రాజకీయంగా వాడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు “కాదనడం”, ఇప్పుడు “వద్దనడం” వెనుక ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు. కార్మికులకు మద్దతు ఇవ్వడం తప్పు కాదు, కానీ దీన్ని పూర్తిగా రాజకీయ కోణంలో వాడుకోవడం వల్ల సమస్య పరిష్కారానికి ఉపయోగం ఉండకపోవచ్చన్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ప్రస్తుతం అధికారికంగా పార్టీ అధినేత జగన్ ఈ అంశంపై స్పందించకపోయినా, మాజీ ఎంపీ వ్యాఖ్యల ద్వారా పార్టీ వైఖరి బహిర్గతమవుతోంది. దీంతో, వైసీపీ నిజంగా కార్మికుల భవిష్యత్తు కోసం ముందుకు వస్తోందా? లేక రాజకీయ లాభాల కోసం ఈ ఉద్యమాన్ని వాడుకుంటోందా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ఏదేమైనా విశాఖ ఉక్కు మరోసారి ఆంధ్ర రాజకీయాల్లో కీలక చర్చకు దారితీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: