
అయితే ఇక్కడే కీలక సమస్య ఉంది. మొత్తం 175 స్థానాల్లో 164 కూటమి ఖాతాలో ఉన్నాయి. కేవలం 11 మందితోనే వైసీపీ విపక్షం బెంచీల్లో కూర్చోనుంది. సంఖ్య తక్కువ కావడంతో అధికార ప్రతిపక్ష హోదా జగన్‌కి దక్కలేదు. సాధారణ ఎమ్మెల్యే స్థాయిలోనే ఆయన్ను పరిగణిస్తారు. దాంతో ఆయనకి మాట్లాడే అవకాశం ఎంత సమయం ఇస్తారన్నది పెద్ద డౌటుగా మారింది. సభలో సమయం కేటాయింపు పూర్తిగా సంఖ్యాబలంపై ఆధారపడుతుంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టంగా చెప్పినట్టుగా వైసీపీకి రోజుకు రెండు ప్రశ్నలే జీరో అవర్‌లో దక్కుతాయి. ప్రశ్నోత్తరాల సమయంలో కూడా రెండు ప్రశ్నలే అడగగలరు. మిగతా చర్చల్లో మైక్ దొరికినా ఐదు నిమిషాలే గరిష్టం అని చెబుతున్నారు. ఆ కాస్త సమయాన్నే జగన్ తన శక్తివంచనలేక వాడుకోవాల్సి ఉంటుంది.
విపక్ష నాయకుడి హోదా ఉంటే అధికార పక్షం విమర్శలకు వెంటనే కౌంటర్ ఇచ్చే వీలు ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి ఛాన్స్ జగన్‌కి ఉందా అన్నది అనుమానమే. అయినప్పటికీ సభలో ఉన్న ఏకైక విపక్షం వైసీపీ కావడంతో ఆ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకుంటే కొంత అదనపు సమయం కూడా దక్కే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద ఈసారి వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ మూడో వారంలో మొదలుకానున్నాయి. అందులో జగన్ ఎంట్రీ ఇస్తే మాత్రం అసెంబ్లీ వేదిక అసలైన రాజకీయరంగస్థలం అవుతుంది. జనాల దృష్టి అంతా అక్కడికే మళ్లిపోతుంది. మైక్ సమయం ఎంత లభిస్తుందన్నది పక్కన పెడితే, జగన్ అసెంబ్లీని వేదికగా మార్చుకుని కూటమి ప్రభుత్వంపై ధాటిగా దాడి చేస్తే… ఆ రిప్లైలో ఎంత సీరియస్‌గా టీడీపీ స్పందిస్తుందన్నది చూడాలి. ఏదేమైనా ఈ వర్షాకాల సమావేశాలు రాజకీయంగా హై వోల్టేజ్ డ్రామా కచ్చితమని చెప్పొచ్చు.