తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే కాళేశ్వరం ప్రాజెక్టుపై మరోసారి సంచలన పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలన్న అంశంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు, తదుపరి విచారణ వరకు ఏ విధమైన చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. అంటే వచ్చే నెల రోజులపాటు కేసీఆర్, హరీష్‌కు పెద్ద ఊరట లభించినట్టే. రాజకీయంగా, న్యాయపరంగా ఇద్దరికీ ఇది కీలక బ్రేక్‌లా మారింది.
 

ఎందుకంటే ఘోష్ కమిషన్ నివేదికలో కాళేశ్వరం నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయని ప్రస్తావించారు. అదే ఆధారంగా సీబీఐకి సిఫారసు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం కోర్టులో సమర్పించిన మెమోలో స్పష్టం చేసింది. ప్రభుత్వం తరపున వాదించిన లాయర్, “సీబీఐ దర్యాప్తు ఘోష్ కమిషన్ మీద ఆధారపడదు. మేము ఇప్పటికే సీబీఐకి దర్యాప్తు కోసం సిఫారసు చేసాం” అని కోర్టులో వాదించారు. అయితే హైకోర్టు మాత్రం క్లారిటీ ఇచ్చింది – “ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. సీబీఐ దర్యాప్తు స్వతంత్రంగా చేయవచ్చు” అని. ఇక్కడే కీలక ట్విస్ట్ ఉంది. అంటే సీబీఐకి దర్యాప్తు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఉన్నా, ఘోష్ కమిషన్ పాయింట్లు ఆధారంగా ముందుకు వెళ్లరాదు. దీంతో సీబీఐ వెంటనే చార్జ్ తీసుకుని చర్యలు మొదలుపెట్టే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది.



 రాజకీయ వర్గాల అంచనాల ప్రకారం, హైకోర్టు ఉత్తర్వుల వలన కనీసం కొంతకాలం కేసీఆర్, హరీష్‌లపై ఒత్తిడి తగ్గినట్లే. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి చివరివరకు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది. వేల కోట్ల ప్రాజెక్టుగా నిర్మించిన కాళేశ్వరం డ్యామ్‌లో ఇంజినీరింగ్ లోపాలు, అవినీతి ఆరోపణలు, భారీ బిల్లులు – ఇవన్నీ ఎప్పుడూ వివాదాస్పదంగా మారాయి. ఇప్పుడు ఘోష్ కమిషన్ నివేదిక మరింతగా వివాదాన్ని పెంచింది. అయితే హైకోర్టు ఇచ్చిన తాజా స్టే కేసీఆర్, హరీష్‌లకు తాత్కాలిక ఉపశమనం. కానీ అదే సమయంలో రాజకీయంగా వారిపై వచ్చిన ఇమేజ్ డ్యామేజ్ అలాగే కొనసాగుతుందని విశ్లేషకుల అభిప్రాయం. అసలు కాళేశ్వరం సత్యం ఎప్పుడెప్పుడు బయటపడుతుందన్నది ఇప్పుడు ప్రజలలో ఉత్కంఠ రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: