ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పని విషయంలో ఎంత కఠినంగా ఉంటారో అందరికీ తెలుసు. ఆయనకు పనిలో శ్రద్ధ, సమయపాలన అనేవి ప్రధాన మంత్రాలు. మెచ్చుకోలు కబుర్లు చెప్పేవారిని కంటే పనిని నిబద్ధతగా చేసే వారిని ఆయన ఎక్కువగా ఇష్టపడతారు. రోజంతా అధికారిక కార్యక్రమాలతో బిజీగా గడిపే చంద్రబాబు, పనికి మించిన వ్యాపకాల గురించి పెద్దగా ఆలోచించరు. కానీ ఆయన కూడా మనిషే కదా! భావోద్వేగాలు, జ్ఞాపకాలు, అనుబంధాలు అన్నీ ఆయన హృదయంలో దాగి ఉంటాయి. ఇటీవల అలాంటి ఒక అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకుంటూ కొద్దిసేపు ఎమోషన్ అయ్యారు. అది ఏంటంటే – అంబాసిడర్ కారు! 1995లో సీఎం అయినప్పుడు చంద్రబాబు వాడిన అధికారిక వాహనం అది.
 

“393” నెంబర్‌ ఉన్న ఆ అంబాసిడర్‌ కారు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ వీధుల్లో దర్జాగా దూసుకుపోయేది. యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్‌గా ఉన్న చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన ప్రతి అడుగులోనూ ఆ కారు సాక్షిగా నిలిచింది. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే, మొదటగా బయలుదేరేది ఆ 393 అంబాసిడర్‌నే! ఆ కాలంలో ఆ కారు అంటేనే చంద్రబాబు సింబల్‌ లా మారిపోయింది. ఆయన కాన్వాయ్‌లో ముందుండే ఆ అంబాసిడర్‌ ను చూసిన ప్రజలు “బాబు వచ్చారు!” అని ఆనందంగా కేకలు వేస్తుండేవారు. వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఆ వాహనం బాబుతో కలిసి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలకు, అభివృద్ధి యాత్రలకు భాగస్వామ్యమైంది. అలా ఆ కారుతో బాబుకు ఏర్పడిన అనుబంధం నేటికీ ఆయన మదిలో సజీవంగానే ఉంది.



ఇప్పటి రోజుల్లో కాలం మారింది. భద్రతా కారణాల వల్ల ఆధునిక బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల్లో బాబు ప్రయాణిస్తున్నారు. కానీ ఆయన మనసులో మాత్రం ఆ పాత 393 అంబాసిడర్‌కే ప్రత్యేక స్థానం ఉంది. చాలాకాలంగా హైదరాబాదులో పార్టీ ఆఫీసులో ఉంచిన ఆ కారును ఆయన ఇటీవలే అమరావతికి తెప్పించారు. తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శనివారం ఆ కారును చూసిన బాబు క్షణం పాటు ఆగిపోయారు. కారును చుట్టూ తిరిగి చూశారు. కాసేపు మౌనంగా ఆ జ్ఞాపకాలలో మునిగిపోయారు. ఆ సమయంలో తనతో ఉన్న నాయకులకు బాబు ఆ కారు గురించి, అప్పటి జ్ఞాపకాల గురించి చెప్పుకుంటూ ముచ్చటపడ్డారు. “ఇది నా మొదటి అధికారిక కారు. ఎన్నో సవాళ్లు, ఎన్నో విజయాలు… ఇవన్నీ ఈ 393 అంబాసిడర్ సాక్షిగా చూశాయి” అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ అంబాసిడర్ కారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శాశ్వత స్థానం దక్కించుకుంది. చంద్రబాబు స్వయంగా దానిని అక్కడే ఉంచాలని ఆదేశించారు. బాబుకు ఇది కేవలం ఒక వాహనం కాదు – ఆయన రాజకీయ ప్రయాణానికి, కృషికి ప్రతీక. అందుకే ఆ 393 అంబాసిడర్ ఆయన మదిని ఇప్పటికీ దోచుకుంటూనే ఉంది!

మరింత సమాచారం తెలుసుకోండి: