- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణ రాజ‌ధాని గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక ఈ రోజు జ‌ర‌గుతోంది. ఈ ఉపఎన్నికకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కీలకమైనదిగా భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు, మహిళలు, యువ ఓటర్ల శాతం దాదాపు సమానంగా ఉండడం ఆసక్తికరంగా ఉంది. ఈ సారి మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే నెలకొంది. ఉపఎన్నిక బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అవసరమైంది. ఆయన భార్య మాగంటి సునీత బీఆర్‌ఎస్ తరఫున బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మూడు పార్టీలూ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గట్టి ప్రచారం నిర్వహించాయి.


ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో నాలుగు ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుండి ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు తరలింపునకు సిద్ధం చేశారు. సాయంత్రం కల్లా అన్ని కేంద్రాలకు పోలింగ్ సామగ్రి చేరేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలింగ్ సాఫీగా సాగేందుకు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 5 వేలమంది సిబ్బంది ఈ ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు. వీరిలో 3 వేల మంది పోలింగ్ సిబ్బంది కాగా, 2 వేల మంది పోలీసులు భద్రతా బాధ్యతలు నిర్వర్తిస్తారు. 407 పోలింగ్ కేంద్రాల్లో 226 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. అక్కడ 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. అదనంగా కేంద్ర బలగాలు మోహరించబడ్డాయి.


మొదటి సారిగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో డ్రోన్ల సాయంతో పర్యవేక్షణ జరగనుంది. అలాగే 45 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఏర్పాటయ్యాయి. ఇప్పటి వరకు 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేయగా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) ఉల్లంఘనలకు పాల్పడిన 27 మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మొత్తం మీద, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు సక్రమంగా పూర్తయ్యాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలూ తమ భవిష్యత్ ప్రతిష్ఠను ఈ ఎన్నికలతో ముడిపెట్టుకున్నాయి. రేపటి ఓటింగ్‌లో ఓటర్ల తీరే తుది ఫలితాన్ని నిర్ణయించబోతోంది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు ? ఈ స‌స్పెన్స్‌కు 14న తెర‌ప‌డ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: