- రాజధానిలో బిసిలకు వాటా కోసం రాష్ట్రస్థాయి పోరాటానికి సిద్ధం
- త్వరలోనే బిసి సంఘాలు, బిసి పెద్దలతో చర్చా వేదిక
- మంగళగిరి కార్తీక వన మహోత్సవంలో బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ సంచలన వ్యాఖ్యలు
రాజధానిలో బిసిల్లోని అన్ని సామాజిక వర్గాలకు భూములు కేటాయించి ఆత్మగౌరవ భవానాలను నిర్మించి ఇవ్వాలని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం మంగళగిరిలో జరిగిన కార్తీక వనమహోత్సవంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న తీవ్ర అన్యాయంపై, ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిపై తన గళాన్ని బలంగా వినిపించారు.
గెజిట్ లేని రాజధాని... ఇది ప్రభుత్వాల వైఫల్యం.. !
ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం దాటింది. 12 ఏళ్లు గడుస్తున్నా, ఇంతవరకు మన రాజధానికి ఒక చట్టబద్ధమైన గెజిట్ నోటిఫికేషన్ తీసుకురాకపోవడం గత, ప్రస్తుత పాలకుల చేతకానితనానికి నిలువుటద్దం. రాజధానిపై స్పష్టత ఇవ్వకుండా, పెట్టుబడుల పేరుతో మాయాజాలం సృష్టిస్తూ, ప్రజల భవిష్యత్తుతో, ముఖ్యంగా రాష్ట్రానికి వెన్నెముక అయిన బీసీల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు," అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బీసీల ఆత్మగౌరవాన్ని కాలరాస్తారా.. ?
"రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు, రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అడుగడుగునా అన్యాయానికి, అవమానానికి గురవుతున్నారు. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. అందుకే, మా భారత చైతన్య యువజన పార్టీ ఒకటే డిమాండ్ చేస్తోంది. రాజధాని అమరావతిలో, పెత్తందార్లకు కాకుండా, ఈ రాష్ట్రానికి పునాది అయిన బీసీలలోని ప్రతి సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించాలి. ప్రతి కులానికి వారి సంస్కృతిని, గౌరవాన్ని ప్రతిబింబించేలా ఆత్మగౌరవ భవనాలు, సాంస్కృతిక భవనాలు, మన యువతకు ఉపాధినిచ్చే నైపుణ్య శిక్షణా కేంద్రాలు ప్రభుత్వమే తన సొంత ఖర్చుతో నిర్మించి ఇవ్వాలి. ఇది మేము అడుగుతున్న డిమాండ్ కాదు, ఇది బీసీల హక్కు," అని రామచంద్ర యాదవ్ ఉద్ఘాటించారు.
హక్కుల కోసం పోరాటానికి సిద్ధం.. !
"ఈ అన్యాయాన్ని ఇక చూస్తూ ఊరుకోము. బీసీల హక్కుల సాధన కోసం, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం, త్వరలోనే బీసీవై పార్టీ ఆధ్వర్యంలో, అన్ని బీసీ కుల సంఘాలు, మేధావులు, పెద్దలతో రాష్ట్రస్థాయిలో ఒక భారీ చర్చా వేదికను ఏర్పాటు చేసి, భవిష్యత్ పోరాట కార్యాచరణను ప్రకటిస్తాం. ఇది కేవలం ఒక పార్టీ పోరాటం కాదు, ఇది బీసీలందరి ఉమ్మడి పోరాటం. ఈ పోరాటానికి బీసీలంతా ఏకమై, అండగా నిలవాలి. మీ అందరి పక్షాన, ముందుండి ఈ యుద్ధాన్ని నడిపించే బాధ్యత నేను తీసుకుంటున్నాను," అని రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి