ఆంధ్రప్రదేశ్‌లో నిన్న పర్యటించిన కేంద్ర మంత్రి గడ్కరీ విజయవాడలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనేక ప్రాజెక్టులకు ఆన్ లైన్ ద్వారా శంకుస్థాపనలు చేశారు. విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రసంగించిన నితిన్ గడ్కరీ ఆసక్తికరంగా ప్రసంగించారు. రొటీన్ నాయకుడిగా కాకుండా కాస్త హృదయంతో మాట్లాడినట్టు అనిపించింది.


అయితే.. ఆయన చేసిన కొన్ని కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆయన పోలవరం ప్రాజెక్టు గురించి ప్రసంగించిన సమయంలో ఈ కామెంట్లు చేశారు. తనకు విజయవాడ వస్తే పోలవరం ప్రాజెక్టు కోసం తాను చేసిన ప్రయత్నాలు గుర్తొస్తాయట. మోడీ సర్కారు 2014లో అధికారంలోకి వచ్చిన కొత్తలో పోలవరం ప్రాజెక్టు కోసం గడ్కరీ అనేక సమావేశాలు నిర్వహించారు. ఎందుకంటే పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి.. కానీ.. నిర్మాణం తాము చేపడతామని చంద్రబాబు సర్కారు ముందుకొచ్చింది.


ఈ సమయంలో ఓ చిక్కు వచ్చి పడింది.. ఈ పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ఎంతకీ పని ప్రారంభించడం లేదు. ఆ కాంట్రాక్టర్ అనేక చిక్కుల్లో ఇరుక్కుపోయాడు. ఆ  సమయంలో తాను ఎన్నో చర్చలు జరిపి ప్రాజెక్టు పని ప్రారంభమయ్యేలా చేశానని గడ్కరీ గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంలో ఆయన ఓ వ్యాఖ్య చేశారు.. కొందరు అవకాశాలను సమస్యలుగా మార్చుకుంటారు.. మరికొందరు సమస్యలను అవకాశాలుగా మార్చుకుంటారు.. అని వ్యాఖ్యానించారు.


మరి ఇంతకీ అవకాశాలను సమస్యలుగా మార్చుకున్నది ఎవరు.. పోలవరం కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్ గురించే గడ్కరీ మాట్లాడారా.. లేక.. వేదికపై ఉన్న సీఎం జగన్ గురించా.. అన్నది చాలా మందికి అర్థం కాలేదు.. కానీ టీడీపీ సోషల్ మీడియా మాత్రం ఆ వ్యాఖ్యలను సీఎం గురించి అంటున్నట్టుగా వైరల్‌ చేయడం ప్రారంభమయ్యాయి. మరి ఇంతకీ అసలు గడ్కరీ ఆ మాటలు అన్నది ఎవరి గురించన్నది మాత్రం చెప్పలేం.. ఎవరికి వారు అన్వయించుకోవాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: