సంద‌ర్భం : నేడు జ‌యంతి

బాపు గారంటే ఎవురు స‌ర్.. ఎవురు కాదు ఎవ‌రు...
ఆయ‌నెక్క‌డుంటారు.. గోదావ‌రి ఒడ్డున ఉంటార‌ని చెప్ప‌నా
లేదా వంశ‌ధార ప‌ర‌వ‌ళ్ల చెంత ఉంటార‌ని చెప్ప‌నా

బాపు గారికి ర‌మ‌ణ గారికి మా ఊరు తెలుసు
 మా ఊరు అన‌గా శ్రీ‌కాకుళం అని అర్థం చెప్పానా
అలానే నేను కూడా తెలుసు..కోటేశ్వ‌ర లింగానికి
అభిషేకం చేయించినోడు ర‌మ‌ణ అని కూడా తెలుసు
రామ రామ అంటూ స్మ‌రిస్తూ బొమ్మ‌లేసిన బాపు గారికి
ఇంకేం అడ‌గ‌ను.. ఏమివ్వ‌ను..


తెలుగంటే ఇష్టం అండి.. తెలుగు క‌ట్టూ బొట్టూ అంటే కూడా మాకెంతో ఇష్టం అండి..మేం రాసుకున్న‌వి మ‌రియు  రాసుకు పూసుకున్న‌వి కూడా తెలుగు వాకిట దొరికితే మేలు. కానీ ఆ విధంగా ఇక్క‌డ ఏవీ లేవు అండి.. వంశీ అన్నారు (డైరెక్ట‌రు) ఓ సంద‌ర్భాన.. నే విన్నాను ఆ సంద‌ర్భాన.. వేళా విశేషాన.. తెలుగులో తెలుగు వెళ్లిపోయింది తెలుగులో తీపెళ్లిపోయింది అని.. మిమ్మ‌ల్ని ఉద్దేశించే అనుకుంటాను.. క‌నుక తెలుగులో వెలుగులో ఎక్క‌డా కూడా మునుప‌టి ప్ర‌భ‌లు లేవు.. కాంతి ఉన్నా కూడా  అదొక నిష్ఫ‌ల. అందుకే మా జీవితాలు  ఏడ్పుగొట్టువి.. గొట్టాం మీడియాల‌కు అంకితం అయి ఉన్న‌వి.. అరంగుళం మార్పు కూడా లేనివి.. మీరు మ‌ళ్లీరండి! మాకో ట్యూష‌ను చెప్పించండి.. లెక్చ‌రు ఇప్పించండి.. అందుకు బుడుగు అందుకు గిరీశం కాస్తో కూస్తో సాయం చేస్తే మేలు.. మీ బొమ్మ‌లు మ‌ళ్లీ మ‌ళ్లీ ఈడ‌నే యాడ‌నో ఉన్నాయి.. లాయరు గారు..కాస్త మాక్కూడా ఆ ట్రిక్కులు నేర్పించండే! ఏండే వింటున్నారా?
ఇంకా చెప్పాలంటే... మీరు వినాలంటే...

అడ‌గ‌డానికేం లేదు ఎక్కువ / త‌క్కువ‌లు
తూకం వేయడానికీ ఏం లేదు బొమ్మ‌లొచ్చ‌న్న పోజు నీది
రాతొచ్చ‌న్న పోజు ఆయ‌న‌ది మిష్ట‌ర్ ర‌వ‌ణ్రావ్‌.. నువ్వూ అక్క‌డ సేఫే కదా!
వెరీ సారీ! అగ్నానంతో.. అప్పుడెప్పుడో బాపూ ! ర‌మ‌ణుల ర‌మ‌ణుడు అనేశా..
రాంగో / రైటో తెలియ‌దు..తెలుసుకోవాల‌న్న యావ అస్స‌ల‌స్స‌లు లేదు.
ఎందుకంటే ఇప్పుడెవ్వ‌డైనా నోటిచ్చుకు కొట్టిన‌చో ఆనందింతును క‌నుగ‌!
క‌ళ్లింత‌లు జేసుగొన‌గ‌!

అయ్యా! మా చెట్టు నీడ‌ల మాట‌కేం కానీ...ప్రాస‌లు / ప్ర‌యాస‌లు నా ద‌రిద్ర‌గొట్టు జీవితానికి త‌ప్ప‌నిస‌ర్లే కానీ మీరు హ్యాపీసు క‌దా! మ‌న్నించండి కొంచెం లేటు ... హ్యాపీ బ‌ర్త్ డే టు యు. సీగాన పెసూనాంబ త‌ర‌ఫున కూడా..! బుడుగు గాడు ఇదిగో ఇప్పుడే రెండ్జ‌ళ్ల సీత‌కు లైనేసే ప‌నిలో య‌మ బిజీసూ..! తెల్సుగా ఆఫీసంటే..మంచి అనే పేరుని ఒంటికి త‌గిలించుకు తిరిగే మగానుభావులే ఎక్కువ‌ని.. అంచేత ఈ క‌ళాపోస‌నకు ఇక్క‌డితో కామా కొట్టేస్తూ..! ఆమె గారి సొగ‌సు చూడడంలోనే త‌రిస్తూ.. కోప‌తాపాల కొంగుముడులు విప్పే ఆరాటంలో అక్క‌డెవ్వ‌డో ఉన్నాడ‌ట వాడి జంఝాటం ఏందో క‌నుక్కొంటా.. ఉంటా! మ‌రే! కిసుక్కున న‌వ్వకేం. న‌మ‌స్తే.


- శుభాకాంక్ష‌లతో శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి: