
శ్రావణ మాసంలో వచ్చే సోమవారం శివన్నిపూజించడానికి అత్యంత విశిష్టకరమైన రోజు.శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు శివునికి అత్యంత భక్తి శ్రద్దలతో పూజ చేసి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు , బిల్వార్చనలు చేస్తే ఎంతో మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.అలాగే ఈ శ్రావణ మాసంలో మంగళవారం రోజున స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో మంగళ గౌరీ వ్రతం చేస్తే కుటుంబానికి చాలా మంచిది.ఈ వ్రతాన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ , మంగళగౌరీ నోము అని కూడా పిలుస్తుంటారు. ఈ మంగళగౌరీ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాలు క్రమం తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు నిండు నూరేళ్లు సుమంగళిగా జీవిస్తూ, వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు వెల్లువెత్తుతాయి.
అలాగే శ్రావణ మాసంలో చేసే వ్రతాల్లో వరలక్ష్మీ వ్రతంకు ఎంతో ప్రాధాన్యత ఉంది శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతం చేయాలి. ఆ రోజు కుదరకపోతే మరొక శుక్రవారమైనా ఈ వ్రతం చేయాలి. చక్కగా పొద్దునే లేచి, తలకు స్నానం చేసి ఇల్లు, పూజ మందిరం శుభ్రం చేసి పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ కలశానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి భక్తి శ్రద్దలతో పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి ఆ కంకణంను చేతికి కట్టుకోవాలి.ఆ తరువాత వచ్చిన ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి వాళ్ళ ఆశ్వీరాదాలు తీసుకోవాలి.