- వేళ యేళ్ల చరిత్ర ఉన్నా అభివృద్ధి లేదు
- గుప్త నిధుల పేరుతో తవ్వకాలు... ధ్వంసం
కామవరపుకోట : మండల కేంద్రమైన కామవరపుకోటకు కూతవేటు దూరంలో ఉంది పాతూరు. ఈ గ్రామ శివారున వాలీ సుగ్రీవుల గట్టకు త్రేతాయుగం నాటి చరిత్ర ఉందన్న నానుడి ఉంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి గట్టుపై తారాదేవి ఆలయంతో పాటు ఏకశిలపై గరుత్ముంతుడు, వాలీ,సుగ్రీవ, ద్వారపాలకుల విగ్రహాలు ఉన్నాయి.
వాలీ, సుగ్రీవ యుద్ధం జరిగిందా...?
పురాణాలు.. ఈ ప్రాంత పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం కొన్ని వందల ఏళ్ల నుంచి ఒక కథ ప్రచారంలో ఉంది. తారాదేవి కోసం ఇక్కడే వాలీసుగ్రీవులు యుద్ధం చేసుకున్నారని చెపుతారు. ఒకప్పటి దండకారణ్యంలో ఈ ప్రాంతం కూడా భాగంగా ఉండేదట. కొండ కొండ కింద వాలీ, సుగ్రీవుడు యుద్ధం చేసుకుంటున్నట్టు ఎదురెదురుగా ఏక శిలా విగ్రహాలతో ఉంటారు. 8 అడుగుల ఎత్తు.. 3 అడుగులు మందంతో ఈ విగ్రహాలు ఢీకొన్నట్టుగా ఉండడమే వీరు యుద్ధం చేసుకున్నారు అనేందుకు నిదర్శనం అని చెప్పేవారు.
తారాదేవి :
కొండపైన తారాదేవి లక్ష్మీదేవి అవతారంలో మనకు దర్శనమిస్తారు. కింద వాలీసుగ్రీవ విగ్రహాల నేపథ్యంలో తారాదేవి అని చెప్పినా... చేతిలో కమలం పువ్వుతో ఉండడంతో లక్ష్మీదేవిగాను కొందరు అభివర్ణిస్తున్నారు. ఆమె సుగ్రీవుని భార్యగా రామాయణంలో మనకు తెలుసు. తార ఆలయం వెనక వైపు రాములవారి పాదాలు ఉన్నాయి. తార గుడిని ఆనుకుని కొండపైన ఒకే రాతిమీద చెక్కబడిన 7 అడుగుల గరుత్మంతుడు విగ్రహం ఉంది.
నాగద్వారం :
తారాదేవి, చీకటి గది మధ్యలో నాగద్వారం ఉంది. కొన్ని సంవత్సరాల వరకు ఈ నాగద్వారం వద్దకు ఓ నాగజాతి పాము వచ్చి భక్తులు పోసిన పాలు స్వీకరించి వెళుతూ ఉండేది.
చీకటి గది పాలీ భాష :
ఊహకే అందని విధంగా కొండపై ఉన్న చీకటి గది ప్రవేశ ద్వారం కొన్ని వందల ఏళ్ల క్రితం అద్భుతమైన శిల్పకళాకృతితో చెక్కినా ఈ నాటికి చెక్కు చెదరకుండా ఆశ్చర్యం కలిగిస్తుంది. పైన కొన్ని అతి పెద్ద పెద్ద రాళ్లు పేర్చిన విధంగా ఉంటే కింద చీకటి గది ప్రవేశ ద్వారం ఉంటుంది. చీకటి గదిలోపల ద్వారపాలకు విగ్రహాలు కాపలాగా ఉంటాయి. లోపల చతురస్త్రాకారంతో ఉన్న గరుడ పీఠం ఉంది. గరుడ పీఠం ఉన్న ప్రాంతంలో ఎప్పుడూ నీళ్లు నిల్వ ఉంటాయి. చీకటి గదిలో ఓ శాసనం పాలీ భాషలో ఉంది. చాలామంది చరిత్ర కారులు ఈ భాషపై పలు రకాల పరిశోధనల తర్వాత దీనిని పాలీభాషగా గుర్తించారు. ఈ శాసనం ఈ ప్రాంతం యొక్క ప్రాశస్త్యం గురించి చెపుతున్నా... ఇది ఎవరు వేశారు ? ఇందులో ఏం ఉంది ? అన్నది ఇప్పటకీ ఎవ్వరికి అంతు పట్టడం లేదు. అయితే ఈ పాలీ భాషను బట్టి చూస్తే ఈ వాలీసుగ్రీవ కొండకు.. దీనికి సమీపంలోనే ఉన్న గుంటుపల్లి భౌద్ధ గుహలకు సంబంధం ఉందని భావించవచ్చు.
ఎలా చేరుకోవాలి :
ఈ చారిత్రాత్మక ప్రదేశానికి వెళ్లేందుకు రోడ్డు మార్గం ద్వారా మాత్రమే వీలుంది.
* జిల్లా కేంద్రం ఏలూరు నుంచి మండల కేంద్రం కామవరపుకోట 35 కిలోమీటర్లు ఉంటుంది. కామవరపుకోట నుంచి పాతూరు వాలీసుగ్రీవుల గట్టు 4 కి.మీ.. మొత్తం 39 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
* జంగారెడ్డిగూడెం నుంచి అయితే కామవరపుకోట 18 కిలోమీటర్లు.. పాతూరు 4 కిలోమీటర్లు మొత్తం 22 కిలోమీటర్లు వెళ్లాలి.
* ద్వారకాతిరుమల నుంచి కామవరపుకోట 9 కిలోమీటర్లు.. పాతూరు 4 కిలోమీటర్లు మొత్తం 13 కిలోమీటర్లు ఉంటుంది.
రామాయణంలో వాలీ సుగ్రీవుల యుద్ధానికి ఇది చారిత్రక సాక్ష్యం అన్న నానుడి కూడా ఉంది. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన గుంటుపల్లి బౌద్ధారామాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ చారిత్రాత్మక ప్రాంతం ఉంది.
తిరునాళ్లు, ఆచారాలు :
ప్రతి యేటా కార్తీకమాసంలో మంగళవారం తిరునాళ్లు నిర్వహించేవారు. బలుసు పోతయ్య కొన్ని సంవత్సరాలు పాటు ఉత్సవాలు నిర్వహించారు. ఆయన మరణాంతరం తిరిగి రెండు దశాబ్దాల తర్వాత గత మూడేళ్ల నుంచి వాలీసుగ్రీవ అన్నదానకమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు ప్రారంభించి అత్యంత వైభవోపేతంగా నిర్వహించడంతో పాటు అన్నసమారాధాన కూడా నిర్వహిస్తున్నారు. పిల్లలు పుట్టని మహిళలు గరుత్మంతుడి ముందు ఇరవైఏళ్ల క్రితం పానాచారాలు చేసేవారు. అలా చేస్తే తమకు పిల్లలు పుడతారన్న నమ్మకం వారిలో ఉండేది.
గుప్త నిధుల పేరుతో ధ్వంసం... పరిరక్షణ అవసరం :
దశాబ్దం క్రితం ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని కొందరు ఆగంతకులు రాత్రివేళల్లో వాలీసుగ్రీవుల విగ్రహాల కింద, కొండపై చతురస్త్రాకారంలో ఉన్న గురుజును పూర్తిగా తవ్వేశారు. గురుజును పూర్తిగా ధ్వంసం చేశారు. వీరు తారాదేవి కుడిచేతితో పాటు తల సైతం ధ్వంసం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాల నుంచి ఎలాంటి అభివృద్ధి లేక ఎంతో చరిత్ర ఉండి కూడా ఈ వాలీసుగ్రీవ కొండ మరుగున పడిన గొప్ప వైభవంగా నిలిచిపోతోంది. ఇప్పటకి అయినా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు స్పందించి పర్యాటకంగా వాలీసుగ్రీవ కొండను అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి