మ్యాచ్‌లో గెలుపు తథ్యంగా భావించిన జట్టు ఎవరు ఊహించని విధంగా డ్రాతో సరిపెట్టుకుని విజయాన్ని దూరం చేసుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆస్ట్రేలియా 8 వికెట్లకు 510 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా 5 వికెట్లకు 409 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌కు దిగిన సౌత్ ఆస్ట్రేలియా 9 వికెట్లకు 230 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇక 332 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా 148 పరుగులు చేసి 9 వికెట్లు మాత్రమే కోల్పోయింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక్కడ విచిత్రమంతా రెండో ఇన్నింగ్స్ చివరి పది నిముషాల ఆటలో సంభవించింది.
సౌత్ ఆస్ట్రేలియా విధించిన లక్ష్యాన్ని చేధించే క్రమంలో మూడోరోజు ఆటగ ముగిసే సమయానికి వెస్ట్రన్ ఆస్ట్రేలియా 88 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఆట చివరిరోజైన నాలుగో రోజు మూడు సెషన్ల పాటు ఓపికగా ఆడినా వెస్ట్రన్ ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అలా ఆట ఐదు ఓవర్లలో ముగుస్తుందనగా 143 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది. దీంతో మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా కచ్చితంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. విజయానికి ఒక వికెట్ అవసరం ఉండగా టెయిలెండర్లు మాత్రమే క్రీజులో ఉన్నారు. దీంతో సౌత్ ఆస్ట్రేలియా దాదాపు 9 మంది ఫీల్డర్లను సర్కిల్లోనే మొహరించింది. స్లిప్‌లో ఏకంగా ఆరుగురిని నిలబెట్టింది. 4వ ఓవర్ల పాటు ఓపికగా ఆడిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ 5 పరుగులు జత చేశారు.
ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌ను చాడ్ సేయర్స్ వేశాడు. క్రీజులో లియామ్ ఓ కోనర్, లియామ్ గుత్రేయి ఉన్నారు. ఆఖరి బంతిని కోనర్ ఫ్లిక్ చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచి స్లిప్‌లో పడింది. అప్పటికే ఆరుగురు ఫీల్డర్లు ఉండడంతో క్యాచ్ అని భావించారు. ఇక సౌత్ ఆస్ట్రేలియా విజయం తథ్యమని అనుకున్నారు. కానీ ఆశ్చర్యంగా ఫీల్డర్ ఆ క్యాచ్ అందుకోలేకపోయాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో సౌత్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు నిరాశలో మునిగిపోయారు. విజయం వరించినట్లే వరించి చేజారిపోయిందని బాధపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.