ఐపీఎల్‌ 2025 18వ సీజన్‌ ముగింపు దశకు చేరిన నేపథ్యంలో, నేటి (మే 30) ఎలిమినేటర్‌ మ్యాచ్‌ తీవ్ర ఆసక్తికి కేంద్రబిందువైంది. గుజరాత్‌ టైటాన్స్‌ (GT), ముంబై ఇండియన్స్‌ (MI) జట్లు చండీగఢ్ వేదికగా తలపడనున్నాయి. ఈ పోరులో ఓడిన జట్టు ఐపీఎల్‌ నుంచి నిష్క్రమించనుండగా, గెలిచిన జట్టు జూన్‌ 1న క్వాలిఫయర్‌–2లో పంజాబ్‌ కింగ్స్‌తో (PBKS) పోటీ పడనుంది. ఆ మ్యాచ్‌లో విజేత జూన్‌ 3న జరగనున్న ఫైనల్‌లో RCBను ఢీకొననుంది.

గత సీజన్‌ రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఈసారి కూడా అద్భుత ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో, 18 పాయింట్లు సాధించి పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కి అర్హత పొందింది. కెప్టెన్ శుబ్‌మన్‌ గిల్, ఓపెనర్ సాయి సుదర్శన్ లపై ఈ మ్యాచ్‌ లో కీలక భారం ఉంది. అయితే స్టార్‌ ఓపెనర్ జోస్‌ బట్లర్‌ గాయంతో అందుబాటులో లేకపోవడం గుజరాత్‌ కు ఎదురుదెబ్బగా మారింది. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌ లో రూథర్‌ ఫోర్డ్, షారుక్ ఖాన్, తెవాటియా కీలకంగా నిలవాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ లాంటి అగ్రశ్రేణి బౌలర్లు ఉన్నారు.

హార్దిక్‌ పాండ్యా సారథ్యం లోని ముంబై ఇండియన్స్‌, ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి నాలుగో స్థానంతో ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించింది. అయితే, ఈ సీజన్‌లో గుజరాత్‌ తో జరిగిన రెండు మ్యాచ్‌ ల్లోనూ ముంబై ఓడిపోయింది. బ్యాటింగ్‌ లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రికెల్టన్, నమన్ ధీర్ కీలకంగా కనిపిస్తుండగా.. బౌలింగ్‌ లో బుమ్రా, బౌల్ట్, దీపక్ చహర్, మిచెల్ సాంట్నర్ మెరుగైన ప్రదర్శన చేయాల్సిన సమయం ఇది. పాండ్యా కెప్టెన్సీ లో జట్టు నిలకడగా కనిపిస్తుండటం ముంబైకు ఓ శుభ పరిణామం. నేటి మ్యాచ్‌ మరింత రసవత్తరంగా మారనున్నది. ఇరు జట్లూ బలమైన బౌలింగ్, సరికొత్త ఫామ్‌ లో ఉన్న బ్యాటింగ్‌ తో మైదానంలోకి దిగనున్నాయి. ఓడిన జట్టుకు ఇదే చివరి అవకాశం కావడంతో హోరాహోరీ పోరు తప్పదనే అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl