కరోనా వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే నిర్థరణ పరీక్షలు తప్పనిసరి. కానీ.. కరోనా పరీక్షా కేంద్రాలకు వెళ్లాలంటేనే దడ పుడుతోంది. అక్కడకు వచ్చేదంతా కరోనా లక్షణాలతో పరీక్షల కోసం వచ్చేవారే. కరోనా సోకని వారు పరీక్ష కోసం వెళ్లినా.. అక్కడే వారికి కరోనా సోకే ప్రమాదం కూడా ఉంది. కానీ పరీక్ష కేంద్రాల్లోనే కరోనా నిర్థరణ జరుగుతోంది. అంతే కాదు... కరోనా నిర్ధారణ పరీక్షలో నమూనాలను సేకరించడం, వాటిని ల్యాబ్‌కు పంపడం, పరీక్ష నిర్వహించాలి.. ఆ తర్వాత ఫలితాన్ని తెలియజేస్తారు. ఇలా అనేక దశలు ఉంటాయి.

ఫలితంగా దీనికి చాలా సమయం పడుతోంది.  ఈ ఇబ్బందులు తప్పించడానికి ఇటీవల కరోనా నిర్థరణ కిట్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు కిట్ తో కూడా పని లేకుండా కేవలం స్మార్ట్‌ఫోన్‌ తోనే కరోనా నిర్థరణ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేస్తోంది. దీంతో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షను చాలా సులువుగా నిర్వహించడంతోపాటు బాధితుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చట. ఈ టెక్నాలజీని కెనడా శాస్త్రవేత్తలు డెవలప్ చేస్తున్నారు.

ఈ కొత్త విధానంలో స్మార్ట్‌ ఫోన్‌ కెమెరా సాయంతో చేపట్టే పరీక్ష వల్ల కరోనా వైరస్‌ను వేగంగా గుర్తిస్తారట. కేవలం స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత క్వాంటమ్‌ బార్‌కోడ్‌ సీరోలాజికల్‌ ఆసే సాధనాన్ని టొరంటో విశ్వవిద్యాలయ సైంటిస్టులు డెవలప్ చేశారు. ఇందుకోసం క్వాంటమ్‌ డాట్‌ బార్‌కోడ్‌తో కూడిన సూక్ష్మ పూసలను ఏర్పాటు చేశారు. రోగి రక్తంలో కొవిడ్‌-19 యాంటిజెన్‌కు సంబంధించిన యాంటీబాడీలను సెర్చ్ చేసేందుకు సెకండరీ లేబుల్‌ను రూపొందించారు.

రక్త నమూనాలో యాంటీబాడీలు ఉంటే ఈ సూక్ష్మ పూస రంగు మారిపోతుందట. స్మార్ట్‌ఫోన్‌ కెమెరాతో ఈ పూసను క్లిక్‌మనిపిస్తే.. ఫోన్‌లోని ప్రత్యేక యాప్‌ ఈ ఫొటోను ప్రాసెస్‌ చేస్తుంది. పూసలో చోటుచేసుకున్న మార్పులను బట్టి ఫలితం చెబుతుంది. అంతే కాదు.. డేటాను సమగ్రంగా పరిశీలించి ఆ వివరాలను చెబుతుంది. వైద్య నిపుణులకూ ఆ డిటైల్స్ పంపుతుంది. రక్త నమూనాలోని కీలక బయో మార్కర్లు స్వల్ప స్థాయిలో ఉన్నా కూడా ఇది గుర్తిస్తుందట. త్వరలోనే ఈ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: