తెలుగు ప్రేక్షకులకు 'ఆనందం' రుచి చూపించి, నమితను ' సొంతం'గా భావించేలా చేశాడు. 'వెంకీ'తో రవితేజకు అండగా నిలిచి చిరు సినిమాతో 'అందరివాడు' అయ్యాడు. కామెడీకి ఢీ, రెడీ అంటూనే నాగార్జునను 'కింగ్' గా చేసి అలరించాడు. మహేష్ లో 'దూకుడు' చూపించి ఆయనలోని సరికొత్త స్టార్ కమెడియన్ ను పరిచయం చేశాడు . ఎన్టీఆర్ ను టాలీవుడ్ కు 'బాద్ షా' చేసేసాడు. 'బంతిపూల జానకి' అంటూ ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ఆయన అభిమానులకు ఓ అద్భుతమైన జ్ఞాపకం. ఆ తర్వాత మహేష్ 'ఆగడు; అంటూనే రామ్ చరణ్ లో 'బ్రూస్ లీ'ని చూపించాడు. ఇలా టాలీవుడ్ లో అటు కామెడీ, ఇటు యాక్షన్ సన్నివేశాలతో వెండితెరపై ప్రేక్షకులకు కితకితలు పెట్టేసాడు. ఆ కామెడీ అండ్ యాక్షన్ వెనకాల ఉన్న రియల్ హీరో దర్శకుడు శ్రీను వైట్ల. ఈ రోజు ఆయన పుట్టిన రోజు.

1972 సెప్టెంబర్ 24న తూర్పు గోదావరి జిల్లా కందులపాలెం అనే పల్లెటూరు లో ఓ పెద్ద కుటుంబంలో జన్మించాడు శ్రీను వైట్ల. చిన్నప్పటి నుంచే సినిమా పిచ్చి మొదలవడంతో ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఎడాపెడా సినిమాలు చూస్తూ మణిరత్నం అంటే పడి చచ్చే వాడు. బీఎస్సిలో చేరిన నాలుగైదు నెలలకే ఇంట్లో కాలేజీ ఫీజు కట్టడానికి ఇచ్చిన డబ్బులను తీసుకుని మద్రాస్ కి ప్రయాణమయ్యాడు. ఆ తరువాత కొన్ని రోజులకే అక్కడ దర్శకుడు కృష్ణ వంశీ కి రూమ్ మేట్ గా మారిపోయాడు. ఎలాగో కొంతకాలం గడిచాక అష్టకష్టాలు పడి 'నీకోసం' అనే సినిమాను తెరకెక్కించాడు. 2001లో విడుదలైన ఈ చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కో సినిమా చేస్తూ స్టార్ డైరెక్టర్ రేంజ్ కి ఎదిగాడు. ఇటీవల 'ఆగడు, బ్రూస్ లీ' డిజాస్టర్ ల కారణంగా కాస్త వెనుకబడినప్పటికీ ప్రస్తుతం మరో కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. మంచు విష్ణుతో 'ఢీ అంటే ఢీ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయిందంటే శ్రీను వైట్ల మళ్లీ ట్రాక్ లోకి రావడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: