
ఈ మద్య కరోనా తో మనుషులు మాత్రమే కాదు.. జంతువులు కూడా సతమతమవు తున్నాయి. మనుషులతో పోలిస్తే జంతువులకు కొద్దిగా తక్కువ కేసులు నమోదు అయినా.. వాటిని గుర్తించడం ఇబ్బందిగానే ఉంది. తాజాగా మహారాష్ట్ర ఔరంగాబాద్ లోని సిద్ధార్థ్ గార్డెన్ జూలో విషాదం నెలకొంది. కరీనా అనే ఆడపులి(ఆరున్నర సంవత్సరాలు) గత కొద్ది రోజుల నుంచి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుంది. బుధవారం ఉదయం 5 గంటలకు పులి కరీనా మరణించినట్లు జూ సిబ్బంది తెలిపారు. సిద్ధార్థ్ గార్డెన్ జూలో మొత్తం 12 పులులు ఉన్నాయి. వీటిలో రెండింటిని ముంబైలోని వీర్ మాతా జిజిబాయి ఉద్యానవనానికి తరలించారు.
న్యూయార్క్ లోని బ్రాంక్స్ జూలో కొవిడ్-19తో నదియా అనే నాలుగేళ్ల ఆడపులి మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సెంట్రల్ జూ అథారిటీ సూచనల మేరకు.. పులి రక్త నమూనాలను కరోనా పరీక్షలకు పంపామని చెప్పారు. కరోనా ఫలితం కోసం వేచి చూస్తున్నామని జూ సిబ్బంది ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక పులి చనిపోవడంతో.. సిద్ధార్థ్ జూలో తొమ్మిది మాత్రమే ఉన్నాయి. న్యూఢిల్లీ జూలో ఈ ఏడాది ఏప్రిల్ లో ఓ పులి చనిపోయింది. దానికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఫలితం నెగిటివ్ వచ్చింది.