చినజీయర్ స్వామి.. తెలుగు నాట ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త.. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతలలో ఆయన శ్రీరామనగరం పేరుతో ఓ  ఆశ్రమం నిర్వహిస్తున్నారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ వచ్చాక చినజీయర్ స్వామి ప్రాముఖ్యత మరింత పెరిగింది. కేసీఆర్ చినజీయర్ స్వామికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. యాదాద్రి నిర్మాణం సమయంలో చినజీయర్‌ సూచనలు పాటించారు. దీనికి తోడు ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు కూడా చినజీయర్‌ను అమితంగా ఆరాధిస్తారు. ఇలా మొత్తం మీద ఇప్పుడు చిన జీయర్ ప్రభ వెలుగుతోంది.


చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ముచ్చింతల్‌లో నిర్మితమైన 216 అడుగుల సమతామూర్తి విగ్రహం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దీన్ని సందర్శించేందుకు నేతలంతా క్యూ కడుతున్నారు. నిన్న ఏపీ సీఎం జగన్ సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ పై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిరేపుతున్నాయి. సీఎం జగన్‌ నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయానని చిన‌జీయ‌ర్‌ స్వామి అంటున్నారు. సీఎం జగన్‌ను చినజీయర్‌ స్వామి ప్రశంసించారు.


విద్య, వయస్సు, ధనం, అధికారం.. ఈ నాలుగు ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోరని.. సీఎం జగన్ మాత్రం ఇందుకు భిన్నం అని చినజీయర్ మెచ్చుకున్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌లో ఎలాంటి గర్వం లేదన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ అందరి సలహాలను స్వీకరిస్తారని.. ఆ సలహాలు పాటిస్తారని చిన‌ జీయ‌ర్ స్వామి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను సీఎం జగన్ అందిస్తున్నారని.. ఇందుకు జగన్‌ను అభినందిస్తున్నానని చినజీయర్ అన్నారు.


సీఎం జగన్ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నానని చినజీయర్‌ స్వామి చెప్పారు. వైయ‌స్ఆర్ కూడా తనకు బాగా తెలుసన్న చిన‌జీయ‌ర్ స్వామి.. శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని గుర్తు చేసుకున్నారు. వైయ‌స్ఆర్ కూడా తనకు బాగా తెలుసని.. ముఖ్యమంత్రి కాకముందు వచ్చి త‌న‌ను కలిశారని చినజీయర్‌ స్వామి గుర్తు చేసుకున్నారు. వైయ‌స్ఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని చినజీయర్ స్వామి అన్నారు. శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్‌ను చిన‌ జీయ‌ర్ స్వామి ఘ‌నంగా స‌త్కరించారు. శ్రీ రామానుజ‌చార్యుల చిన్న విగ్రహాన్ని సీఎంకు చిన జీయర్ బ‌హూక‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: