ఏపీ సర్కారు మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది.  చిత్తూరు డెయిరీని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గతంలో చంద్రబాబు.. తన హెరిటేజ్ సంస్థ కోసం ఈ చిత్తూరు డెయిరీని నిర్వీర్వం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు హెరిటేజ్ సంస్థను దెబ్బ తీసేందుకు జగన్ సర్కారు మరోసారి ఈ డెయిరీని తెరపైకి తెస్తోందన్న వాదనలు ఉన్నాయి. తాజాగా అమూల్‌ పాలసేకరణపై సమీక్ష నిర్వహించిన సీఎం.. 2,34,548 మహిళా రైతుల నుంచి అమూల్‌ పాల సేకరణ జరుగుతోందని తెలిపారు.


వచ్చే రెండు నెలల్లో మరో 1,359 గ్రామాలకు అమూల్‌ పాల సేకరణను విస్తరించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అమూల్‌తో ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రోజూ 1.03 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. ఇప్పటి వరకూ అమూల్ సంస్థ ద్వారా  419.51 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. పాల సేకరణ వల్ల ఇప్పటి వరకూ రూ.179.65 కోట్ల చెల్లింపులు జరిగాయని.. దీని ద్వారా పాల రైతులకు అదనంగా రూ.20.66కోట్ల లబ్ధి చేకూరిందని అధికారులు సీఎంకు వివరించారు.


ఏపీలో అమూల్‌ ప్రాజెక్టు అమలు చేయడం వల్ల ఇతర డెయిరీలు కూడా పాల సేకరణ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం జగన్ అంటున్నారు. ఆయా డైరీలు ధరలు పెంచడంవల్ల రాష్ట్రంలో రైతులకు అదనంగా లబ్ది చేకూరుతుందని.. ఇప్పటి వరకూ ఇలా రూ.2,020.46 కోట్ల లబ్ధి చేకూరిందని సీఎం జగన్ చెబుతున్నారు. పాల సేకరణ దారుల్లో పోటీ పెంచడం ద్వారా పాల రైతులకు మంచి ధర వస్తుందని సీఎం చెబుతున్నారు.


గతంలో పాల సేకరణలో పోటీ లేకుండా చేయడం ద్వారా చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థకు మేలు చేకూర్చుకుని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు చిత్తూరు డెయిరీని కూడా పునరుద్ధరించడం ద్వారా జగన్.. చంద్రబాబుకు చెక్ చెప్పాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: