రాష్ట్ర ఆదాయం జాతీయ సగటు కంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సగటు ఎక్కువగా ఉందని వైసీపీ ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. జీఎస్టీ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.6 వేల కోట్లు ఎక్కువగా వచ్చిందని సర్కారు తెలిపింది. మరి అదే నిజమైతే ఆ పన్నులు చెల్లించిన సామాన్య ప్రజలకు, వ్యాపారులకు, పరిశ్రమల నిర్వాహకుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎంతోమంది ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి పన్నులు చెల్లిస్తే వారికి కనీస మౌలిక వసతుల కల్పనను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు.


ఏపీ రాష్ట్రంలోని పారిశ్రామిక వ్యతిరేక విధానాల మూలంగా కొత్తగా పెట్టుబడులు కూడా రావడం లేదని... పెట్టుబడులు పెట్టాలని వచ్చే పారిశ్రామికవేత్తలు సైతం పాలక పక్ష వైఖరితో వెనక్కి వెళ్లిపోతున్నారని నాదెండ్ల మనోహర్‌  ఆరోపించారు. ఈ మూడేళ్ళ పాలన కాలంలో ఎన్ని కొత్త పరిశ్రమలు, ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయో చెప్పగలరా? అని నాదెండ్ల మనోహర్‌  నిలదీశారు. ఇందుకు సమాధానం లేకపోగా రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి అద్భుతంగా ఉంది అని ప్రజలను మభ్యపెడుతున్నారని నాదెండ్ల మనోహర్‌  దుయ్యబట్టారు.


కాగ్ లెక్కల ప్రకారం చూసినా.. గణాంకాలు పరిశీలించినా ఈ రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి- ఆదాయంలో కాదు అప్పుల్లోనే ఉంది అని అర్థం అవుతోందన్న నాదెండ్ల మనోహర్‌.. తొలి అయిదు నెలల్లో రూ.1,03,975 కోట్లు రాబడి సమకూరినట్లు గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా సమకూర్చుకొన్న ఆదాయం రూ.36,902 కోట్లు మాత్రమేనని తెలిపిన నాదెండ్ల మనోహర్‌.. అంటే మొత్తం సమకూరిన రాబడిలో ఇది 36 శాతం మాత్రమేనని అన్నారు. అప్పులు రూ.44,593 కోట్లు కాగా, కేంద్రం గ్రాంట్లు, పన్నుల వాటా రూ.8,290 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ.14,190 కోట్లు అని తెలిపారు. అప్పులు, గ్రాంట్లు ద్వారా వచ్చింది 64శాతమేనని గణాకాంలతో సహా నాదెండ్ల మనోహర్‌ ధ్వజమెత్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: