వారిద్దరు దంపతులు.. ఫార్మా దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ వ్యవస్థాపకులు.. సంస్థ స్థాపించిన నాటి నుంచే ఎన్నో వ్యాక్సీన్లు రూపొందించి దేశ విదేశాలకు పంపారు. కరోనా కష్ట సమయంలో దేశమంతా వ్యాక్సీన్ కోసం ఎదురు చూస్తున్న వేళ.. మేమున్నామంటూ వ్యాక్సీన్ రూపకల్పనకు నడుంబిగించారు. అప్పటికి కరోనా గురించి తెలిసిన సమాచారం తక్కువ. కరోనా టీకా కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం.. ఆ సమయంలో ఆ దంపతులు.. టీకా కోసం ఎంతో పరిశ్రమించారు. దేశానికి టీకా ఇవ్వాలని తపించారు.


కరోనా భయంతో అల్లాడుతున్న దేశానికి టీకాతో భరోసా కల్పించారు. దేశంలో ఎన్నో ఫార్మా సంస్థలు, బయోటెక్నాలజీ సంస్థలు ఉన్నా.. ఒక్క హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ మాత్రమే ముందుగా కరోనాకు టీకాను రూపొందించింది. భారత్‌ బయోటెక్‌ తో పాటే పూనేకు చెందిన సీరం సంస్థ కూడా కరోనా టీకాను రూపొందించినా అది విదేశీ సంస్థల టై అప్‌తో రూపొందింది. సీరం సంస్థ కేవలం ఉత్పత్తికే పరిమితం అయిన వ్యాక్సీన్ అది. కానీ.. భారత్ బయోటెక్ అలా కాదు.. టీకా టెక్నాలజీ మొత్తం సొంతంగా రూపొందించుకుంది.


అలాంటి భారత్‌ బయోటెక్‌ వ్యవస్థాపకులు సీఎండీ కృష్ణ ఎల్లా, ఆయన భార్య భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా తెలుగువారు కావడం మనకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ శివార్లలోని షామీర్‌ పేటలో ఉన్న జీనోమ్‌ వ్యాలీలో వీరు భారత్ బయోటెక్ సంస్థను ఏర్పాటు చేసారు. భారత్ బయోటెక్ అంత త్వరగా కరోనాకు టీకా తీసుకురావడానికి ప్రధాన కారణం ఆ సంస్థకు ఉన్న మౌలిక సదుపాయాలు.. కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా గార్ల చిత్తశుద్ధి అని చెప్పక తప్పదు.


మొదట్లో భారత్ బయోటెక్‌ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్‌పై అనేక ఆరోపణలు వచ్చినా... కాలక్రమంలో అవన్నీ కొట్టుకుపోయాయి.. ఇప్పుడు కోవాగ్జినే కావాలని జనం క్యూ కడుతున్నారంటే అది కృష్ణ, సుచిత్ర దంపతుల కృషి ఫలితమే. అలాంటి వారికి సంయుక్తంగా పద్మ భూషణ్ అవార్డు దక్కడం తెలుగువారికి గర్వకారణమే.

మరింత సమాచారం తెలుసుకోండి: