
ఇటీవల బీహార్ , గుజరాత్, హర్యానా, జార్ఖండ్ , కేరళ, మహారాష్ట్రల్లో తట్టు కేసులు..... ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ సమస్యను నివారించడానికి 9 నెలల నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలందరికీ తట్టు, పొంగు టీకాలను అదనపు డోసుగా ఇవ్వాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. తాజాగా బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ , ఇతర మహారాష్ట్ర జిల్లాల్లో ఇటీవల తట్టు కేసుల సంఖ్య బాగా పెరిగింది.
ఆ ఒక్క రాష్ట్రంలోనే పది మంది చిన్నారులు తట్టుతో మరణించారు. మహారాష్ట్ర సహా ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ అధికారులకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్యశాఖ కేసుల పెరుగుదలపై అప్రమత్తం చేసింది. ఆయా భౌగోళిక ప్రాంతాల్లో ఇన్ ఫెక్షన్ సోకిన పిల్లలంతా వ్యాక్సిన్ తీసుకోనివారేనని, ఆయా ప్రాంతాల్లో.. వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని కేంద్రం పేర్కొంది. అందుకే 9 నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు అదనపు డోసుగా తట్టు, పొంగు టీకాను ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి పి.అశోక్ బాబు రాష్ట్రాలను కోరారు.
సాధారణంగా తట్టు,పొంగు టీకాలను 9 నుంచి 12 నెలల వయసులో మొదటి డోసు, 16 నుంచి 24 నెలల్లోపు రెండో డోసుగా ఇస్తారు. తాజా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఐదేళ్లలోపు వారికి అదనపు డోసుగా ఇవ్వాలని కేంద్రం సూచించింది.