
ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తి చేసి తీరుతామన్న మంత్రి నిరంజన్ రెడ్డి.. రేవంత్ రెడ్డి సూచనలు, సలహాలు తమకు అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు 17 వేల 351 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత లక్ష 19 వేల కోట్ల రూపాయలతో వరి ధాన్యం మరో 9 వేల 406 కోట్ల రూపాయలతో ఇతర పంటలు కొనుగోలు చేసినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కౌలు రైతులపై ప్రభుత్వ వైఖరిని నిండు శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా వెల్లడించారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
రైతు ఆత్మహత్యలపై రేవంత్ రెడ్డి మాట్లాడడం హస్యాస్పదమని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ధాన్యం కొనమంటే మొహం చాటేసిన కేంద్రాన్ని పల్లెత్తు మాట అనని రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం విడ్డూరంగా ఉందన్న మంత్రి నిరంజన్ రెడ్డి.. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణ బిడ్డగా రేవంత్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మోదీతో ఉన్న లోపాయికారి ఒప్పందమేంటని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ తరహా వ్యవసాయ అనుకూల పథకాలు, విధానాలు దేశంలోని కాంగ్రెస్, భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేవన్న మంత్రి నిరంజన్ రెడ్డి.. కాంగ్రెస్ పాలనలో విత్తనాలు, ఎరువులు, విద్యుత్ కోసం పడి గాపులు, లాఠీఛార్జీలే రైతులకు మిగిలాయని తెలిపారు. కాంగ్రెస్ పాపాలను, భాజపా మోసాలను రాష్ట్ర రైతాంగం మరిచి పోయారనుకోవద్దని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.