
పొద్దున 5.30 వరకల్లా స్కూలుకి తీసుకొస్తే ఒక గంట పాటు వ్యాయామం చేయించి, తర్వాత టిపిన్ చేయిస్తారు. తర్వాత క్లాసులను ప్రారంభిస్తామని చెబుతున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఇంటికి పంపించేస్తామని అంటున్నారు. అనంతరం వేరే స్పోర్ట్ క్లాసులకు తీసుకెళ్లొచ్చని ప్రభుత్వం అంటోంది. కానీ దీనిపై విద్యార్థులు తల్లిదండ్రులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఉదయం 5.30 గంటలకు స్కూలు ప్రారంభం అంటే దాదాపు గంటన్నర ముందు నిద్ర లేవాలి. అంటే 4 గంటలకు లేవాలి. పిల్లలను నిద్రలేపాలి. వారికి కావాల్సిన వంట చేయాలి.
రాత్రి వరకు డ్యూటీ చేసొచ్చిన తల్లిదండ్రులు, లేదా వేరే పనులకు వెళ్లిన వారు ఉదయం నాలుగు, లేదా అంతకు ముందు నిద్ర లేవడం అనేది ఎంతో రిస్కుతో కూడుకున్న వ్యవహారం. ఈ మాత్రం ఆలోచించకుండా ఉదయం 5.30 కే పాఠశాల ప్రారంభం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి నిర్ణయాల వల్ల తల్లిదండ్రులకు, విద్యార్థులకు చాలా ఇబ్బంది కలుగుతోంది. సమయపాలన అనేది సరిగా లేకపోవడంతో సరైన విధమైన ప్రణాళిక లేక విద్యార్థులు నష్టపోతారు. ట్రాన్స్ పోర్టు కు ఎంత సమయం పడుతుంది. గ్రామాల్లో చదువుకునే విద్యార్థులు పట్టణాలకు ఎలా చేరుకుంటారు. అన్ని విధాల ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు విద్యార్థుల జీవితాల్ని నాశనం చేస్తాయనడంలో సందేహం లేదు.