ఇన్నాళ్లూ కోర్టు నిబంధనల మేరకు సైలంట్‌గా ఉన్న చంద్రబాబు.. ఇక రంగంలోకి దిగుతున్నారు. తన రాజకీయ చాణక్యం చూపబోతున్నారు. మొన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు నిన్న తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, వివిధ అంశాలపై పార్టీ నేతలో కీలకంగా చర్చించారు. ఈ భేటీలో ఈ నెల 10నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.


ఈలోపు రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై దిల్లీ వెళ్లి సీఈసీకి ఫిర్యాదు చేయాలని కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి దొంగ ఓట్లు చేర్పించటం, తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తీసేయటం వంటి చర్యలకు పాల్పడుతున్నాడని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆ విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలోనే దిల్లీ వెళ్లేలా చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు.


డిసెంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ లోపు తనకు సమయం కేటాయించాలంటూ సీఈసీ కి చంద్రబాబు లేఖ రాయనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈనెల 10 నుంచి రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్, ఏపీ సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ నెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడపల్లో చంద్రబాబు సమావేశాలు నిర్వహించబోతున్నారు.


పార్టీలకు అతీతంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను సమావేశాలకు ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణయించారు.  ఒక్కో సమావేశానికి సుమారు ఐదారు వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అలాగే తెలంగాణా ఎన్నికలపై తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చంద్రబాబు విశ్లేషించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద మళ్లీ దాదాపు రెండున్నర నెలల తర్వాత చంద్రబాబు రాజకీయ రణరంగంలోకి అడుగు పెడుతున్నట్టు భావించాలి. ఇక ఆట మొదలైనట్టే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: