బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. కొండా సురేఖ ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు జాగ్రత్తగా మాట్లాడాలని కొండా సురేఖను ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. ఇతర పార్టీలను, నేతలు విమర్శించేటప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రి ఉన్న కొండా సురేఖ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.


అసలేం జరిగిందంటే.. ఈనెల 1న వరంగల్ లో మీడియా సమావేశంలో భారాసపై, కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు కర్నె ప్రభాకర్, దాసోజు శ్రవణ్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వారా నివేదిక తెప్పించుకుంది. మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను జిల్లా ఎన్నికల అధికారి ఆంగ్లంలోకి అనువదించి పంపించారు.


కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తే కేటీఆర్ హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశారని.. ఆయనకు సమయం దగ్గరలోనే ఉన్నదని.. ఇప్పటికే మీ సోదరి శ్రీకృష్ణ జన్మస్థానం వెళ్లారన్న కొండా సురేఖ వ్యాఖ్యలను ఈసీ తప్పుబట్టింది. జైలుకు వెళ్లడం ఖాయమన్న భయంతోనే కేటీఆర్ మాట్లాడుతున్నారన్న మంత్రి వ్యాఖ్యలను కూడా ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇలాంటి నిరాధార ఆరోపణలు ప్రతిపక్ష పార్టీ, నేత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎన్నికల ప్రక్రియకు అంతరాయంగా ఉన్నాయని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.


ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. ఇక ముందు మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని మంత్రి కొండా సురేఖను ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి.. సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ సహా.. అందరు నేతలు ఇదే తరహా భాష ఉపయోగిస్తున్నారు. అదుపు తప్పి మాట్లాడుతున్నారు. ఈసీ హెచ్చరికలను పట్టించుకునే స్థితిలో లేరనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: