సీనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాత కొత్త తరం రాజకీయ నేతలను ప్రోత్సహించారు. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఆయన స్పూర్తితో చాలామంది యువకులు పాతికేళ్ల వయసులో టీడీపీలో జాయిన్ అయ్యారు. అప్పట్లో యువతకు కీలక పదవులు అప్పగిస్తూ ఎన్టీఆర్ పార్టీలో సమ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడున్న పొలిట్ బ్యూరోలో సగం మందికి పైగా నేతలు ఆయన హయాంలో రాజకీయ అరంగేట్రం చేసినవారే.
టీడీపీలో సీనియర్ల లిస్ట్ తీస్తే చాలా పెద్దది. దాదాపు 50 మంది పేర్ల వరకు జనాలకు పెద్దగా పరిచయం లేనివే ఉంటాయి. కానీ ఈ సారి చంద్రబాబు మొత్తం కొత్త తరానికి బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో వారంతా అసంతృప్తికి లోనయ్యారు అనే టాక్ నడిచింది. పైగా ఇవే తమకు చివరి ఎన్నికలు చాలామంది ప్రకటించారు కూడా. అయినా చంద్రబాబు వారికి అవకాశం ఇవ్వలేదు. దీంతో అసంతృప్తికి లోనైన వారు పలు సందర్భాల్లో తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు.
ఇదిలా ఉండగా పార్టీలో మూడు సార్లు పదవులు అనుభవించిన వారిని పక్కన పెట్టి కొత్త వారికి చాన్స్ ఇవ్వాలని లోకేష్ అంటున్నారు. ఈ నిర్ణయం కూడా సీనియర్లకు కొంత ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు. లేటెస్ట్ గా స్పీకర్ అయ్యన్నపాత్రుడు డిప్యూటీ సీఎం పదవి లోకేష్ కి ఇవ్వాలన్న దాని మీద మాట్లాడుతూ ఈ డిమాండ్ చేయడానికి పార్టీ నాయకులు ఎవరు అని ప్రశ్నించారు. లోకేష్ కి ఏ పదవి ఇవ్వాలో నిర్ణయించాల్సింది నాయకులు కాదని ప్రజలు అని అయ్యన్న వ్యాఖ్యానించడంతో అది కాస్తా వైరల్ అయింది.
తాజాగా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఇదే విషయం చెప్పారు. లోకేశ్ కు డిప్యూటీ సీఎం అన్న ఆలోచన సరైనది కాదని అన్నారు. లోకేష్ కష్టపడి పనిచేశారని దానికి ప్రతిఫలంగా ఆయనకు ప్రభుత్వంలో మంత్రిగా సముచితమైన స్థానం దక్కిందని గుర్తు చేశారు.
టీడీపీలో జూనియర్ నేతలు లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవాలని కోరుతూ వస్తూంటే సీనియర్ నేతలు మాత్రం ఆ వాదనను పక్కన పెడుతున్నారు. లోకేష్ కి డిప్యూటీ సీఎం అన్నది ఇపుడు అంశం కానే కాదని వారు అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నారు. లోకేష్ అయితే తనకు ఏ పదవి పార్టీ అప్పగించినా చేస్తాను తాను సాధారణ కార్యకర్తను అని పదే పదే చెబుతున్నారు. దీంతో లోకేశ్ వ్యవహరిస్తున్న తీరుపై సీనియర్లు గుర్రుగా ఉన్నారని వారి వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి