
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా టైమ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు ఈ మహమ్మరి దేశదేశాలకు తన విశ్వరూపాన్ని చూపింస్తుంది. ఎన్ని కఠన చర్యలు తీసుకుంటున్నా.. అటు పాజిటివ్ కేసులు, ఇటు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 18 లక్షలకు చేరువయ్యాయి. లక్షా 9వేల చేరువలో మృతుల సంఖ్య ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం 544 కొత్తగా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా దెబ్బకు ప్రజలు, ప్రభుత్వాలు చిగురుటాకులా వణికిపోతున్నారు.
అయినప్పటికీ ప్రపంచదేశాలు కరోనాపై యద్ధానికి వెనకడుగు వేయడం లేదు. కంటికి కనిపించని శత్రువుతో.. చేతులో యుద్ధం లేకున్నా అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా కట్టడికి పలు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో కోట్లాది మంది ఇంటికే పరిమితం అయ్యారు. అన్ని రంగాలూ స్తంభించిపోవడంతో ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలతున్నాయి. ఇక ఈ కరోనా సెగ విద్యారంగంపై కూడా పడింది. స్కూల్స్, కాలేజ్‌లు, పరీక్షలు అన్నీ ఆగిపోయాయి. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి మే నెలలోనే దాదాపు సగానికి పైగా ప్రవేశ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో ఎంసెట్‌తో సహా మిగిలిన అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా పడ్డాయి. ఇక త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. దాదాపు అన్ని ప్రవేశ పరీక్షల గడువు మే 5వ తేదీ వరకు ఉన్నట్టు పాపిరెడ్డి తెలిపారు.