14 ఏళ్ల రికార్డు బద్దలైంది. బంగారం ధరలు ఇంత ఎగిసిపడతాయని ఎవరు ఊహించలేదు. గత కొంతకాలంగా పెరుగుతున్న గోల్డ్ రేట్లు ఇప్పుడు సామాన్యుడే కాక మధ్యతరగతి వర్గాన్నీ భయపెడుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.20 లక్షలకు చేరుకోవడం చరిత్ర సృష్టించింది. ఇక 22 క్యారెట్ల ధర కూడా రూ.1,19,400 పలకడం మార్కెట్ వర్గాలకే షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, జియోపాలిటికల్ టెన్షన్స్, ఫైనాన్షియల్ అనిశ్చితి - ఇవన్నీ కలిసొచ్చి బంగారానికి డిమాండ్ మరింతగా పెరిగింది. అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ భయాలు, ట్రంప్ – డెమోక్రాట్ల మధ్య ఒప్పందం లేకపోవడం వల్ల పెట్టుబడిదారులు ఈక్విటీలు వదిలేసి బంగారం, వెండి వైపు పరుగులు తీశారు. ఫలితంగా బులియన్ మార్కెట్ కాసుల వర్షం కురుస్తోంది.

ఇక గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. గడిచిన పద్నాలుగేళ్లలో ఒకే నెలలో ఇంత పెద్ద ఎత్తున ధరలు పెరగడం ఇదే తొలిసారి. ఒక్క సెప్టెంబర్ నెలలోనే 11.4 శాతం పెరిగాయి. 2011 ఆగస్టు తర్వాత ఇంత పెద్ద లాభం నమోదు కావడం కొత్త రికార్డు. పైగా ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు గోల్డ్ రేట్లు ఏకంగా 23.5 శాతం పెరగడం మార్కెట్ విశ్లేషకులకే అబ్బురం కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో సాధారణ ప్రజల బంగారం కొనుగోలు కలగానే మారిపోతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం తీసుకోవాలంటే రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు భద్రత కోసం బంగారం కొనేవారు. ఇప్పుడు అయితే పెట్టుబడి కోసం కూడా బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఆ రేట్లు సామాన్యుడికి అందని ద్రవ్యంగా మారిపోయాయి.

ఫైనాన్స్ నిపుణులు చెబుతున్నట్లయితే.. రాబోయే రోజుల్లో కూడా గోల్డ్ రేట్లలో వాలాటిలిటీ ఎక్కువగానే ఉంటుందని అంచనా. అమెరికా–చైనా సంబంధాలు, గ్లోబల్ ఎకానమీ స్థితి, క్రూడ్ ఆయిల్ ధరలు - అన్ని కలిపి బంగారం భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. కాబట్టి త్వరలోనే ధరలు స్థిరపడతాయని చెప్పలేము. మొత్తానికి.. “బంగారం” అన్న పదం వింటే ఒక్కసారిగా కళ్ళల్లో మెరుపులు కనిపించే రోజులు పోయాయి. ఇప్పుడు గోల్డ్ రేట్లే మెరుపుల్లా ఎగిసి పడుతున్నాయి. ఒక్క రికార్డు కాదు.. ఇంకా ఎన్నో కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయంటూ బులియన్ మార్కెట్ బిగ్గరగా చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: