
బర్త్‌డే పార్టీ, గెట్ టుగెదర్, ఆదివారం భోజనం.. ఏ సందర్భమైనా చికెన్ వంటకం తప్పనిసరి అయిపోయింది. ఇకపోతే చికెన్ కర్రీలో కొందరు నిమ్మరసం పిండుకుని తింటుంటారు. అయితే ఈ అలవాటు మంచిది కాదని.. చికెన్ కర్రీలో నిమ్మరసం పిండుకుని తినడం డేంజరని చాలా మంది చెబుతుంటారు. వాస్తవానికి చికెన్ కర్రీలో నిమ్మరసం పిండుకుని తినొచ్చు. దీని వల్ల నష్టం కాదు.. లాభాలే ఎక్కువ.
సాధారణంగా చికెన్ లేదా ఇతర నాన్ వెజ్ ఐటెమ్స్ తిన్న తర్వాత కడుపు హెవీ ఉంటుంది. అయితే నిమ్మరసం యాడ్ చేయడం వల్ల అందులోని సిట్రిక్ ఆమ్లం ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. తద్వారా భోజనం తర్వాత పొట్ట బరువుగా అనిపించకుండా ఉంటుంది. అలాగే చికెన్ కర్రీలో ఉండే ఆయిల్, మసాలాల రుచిని నిమ్మరసం సమతుల్యం చేస్తుంది. పులుపు వలన కర్రీకి ప్రత్యేకమైన టాంగీ ఫ్లేవర్ వస్తుంది. కారం, మసాలా ఎక్కువైనా, నిమ్మరసం వేసుకుంటే బ్యాలెన్స్ అవుతాయి.
నిమ్మరసంలో విటమిన్ సి మెండుగా ఉండటం వల్ల ఇది రోగనిరోధక వ్యవస్థలను బలపరుస్తుంది. అదేవిధంగా నిమ్మరసం వలన శరీరానికి తేమ కూడా మంచిగా అందుతుంది. అయితే అధికంగా నిమ్మరసం వేస్తే కర్రీ అసలు రుచి తగ్గిపోతుంది. కర్రీ ఉడికిన తర్వాత, గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతే నిమ్మరసం వేసుకోవాలి. ఒకవేళ నిమ్మరసం వేసి ఉడికిస్తే చేదు రుచి వచ్చే అవకాశం ఉంటుంది.