అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట అనే విషయం తెలిసిందే. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగిన టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి. కానీ 2019 ఎన్నికల్లోనే జగన్ గాలిలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కేవలం 14 సీట్లలో 2 మాత్రమే గెలిచింది. వైసీపీ 12 గెలుచుకుంది. అయితే ఎన్నికలై ఏడాదిన్నర దాటేసింది. ఈ సమయంలో కొన్నిచోట్ల టీడీపీ పుంజుకున్నట్లే కనిపిస్తోంది. అందులో టీడీపీ కంచుకోటగా ఉన్న కళ్యాణదుర్గంలో కాస్త పుంజుకున్నట్లు తెలుస్తోంది.

2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి ఉషాశ్రీ చరణ్ తొలిసారి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి ఉమామహేశ్వర నాయుడుపై దాదాపు 20 వేల మెజారిటీతో విజయం సాధించారు. రాజకీయాల్లో పెద్ద ఫాలోయింగ్ లేని ఉషాశ్రీ కేవలం...జగన్ ఇమేజ్‌తోనే గెలిచారు. అయితే తర్వాత తర్వాత మాత్రం ఉషాశ్రీ ప్రజలకు దగ్గరయ్యారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అటు జగన్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఎమ్మెల్యేకు బాగా ప్లస్ అవుతున్నాయి. పార్టీ పరంగా కూడా కార్యక్రమాలు చేస్తూ, కార్యకర్తలకు అండగా ఉంటున్నారు.

కాకపోతే ఈ ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. అదే సమయంలో టీడీపీ తరుపున ఉమా మహేశ్వరనాయుడు గట్టిగానే పోరాడుతున్నారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు.

దీంతో ఎన్నికల సమయం కంటే ఇప్పుడు కళ్యాణదుర్గంలో టీడీపీ కాస్త అడ్వాంటేజ్ వచ్చిందనే చెప్పొచ్చు. అలా అని వైసీపీని దాటేసి సత్తా ఇంకా రాలేదు. కాకపోతే భవిష్యత్‌లో ఇబ్బంది ఎదురుకావొచ్చు. అయితే ఎమ్మెల్యే మరింతగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, స్థానిక సమస్యలని పరిష్కరిస్తే బాగా ప్లస్ అవుతుంది. కానీ టీడీపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఏ క్షణనైనా ఆ పార్టీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: