గుంటూరు జిల్లా రాజకీయాల్లో కమ్మ సామాజివర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. జిల్లాలో సగం నియోజకవర్గాల్లో కమ్మ నేతల హవానే ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కమ్మ వర్గం ఆధిపత్యం ఎక్కువ. అందుకే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీలోని కమ్మ నేతలకు చెక్ పెట్టడానికి 2019 ఎన్నికల్లో జగన్ వైసీపీలో కమ్మ నేతలని నిలబెట్టారు.


అలా పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్‌పై నంబూరు శంకర్ రావుని నిలబెట్టారు. జగన్ వేవ్‌లో నంబూరు విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నంబూరు సైలెంట్‌గా పనిచేసుకుంటూ వెళుతున్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ, సాధ్యమైన మేర వాళ్ళ సమస్యలని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యేకు ప్లస్ అవుతున్నాయి. అయితే అన్నీ వర్గాల ప్రజలకు అండగా ఉండటంలో ఎమ్మెల్యే సక్సెస్ కాలేదని తెలుస్తోంది.


అటు పథకాల విషయంలో కొన్ని వర్గాల వారికే అనుకూలంగా ఉంటున్నారని తెలిసింది. అలాగే నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయి. అమరలింగేశ్వరస్వామి దేవాలయం ఉన్న అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు. అచ్చంపేట, మాదిపాడులు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. పరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు కృష్ణా నది దాటాలంటే నానా కష్టాలు పడుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణానదిపై బ్రడ్జి నిర్మించాలసిన అవసరముంది. అటు నియోజకవర్గంలో రైతుల పంటలని నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్ అవసరం ఉంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేవు.


ఇక రాజకీయంగా వైసీపీ బలంగా ఉంది కాబట్టి నంబూరు కూడా బలంగానే ఉన్నారు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. అయితే టీడీపీ నేత కొమ్మాలపాటిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈయనకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. పైగా రాజధాని అంశం కలిసొచ్చే అవకాశముంది. ఈ రెండేళ్లలో కొమ్మాలపాటి కాస్త పుంజుకున్నారు. ఇక ఎన్నికల సమయానికి పూర్తిగా పుంజుకుని నంబూరుకు చెక్ పెడతారేమో చూడాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: