తాటికొండ రాజయ్య...తెలంగాణ రాజకీయాల్లో వివాదాలతో మంత్రి పదవి పోగొట్టుకున్న నేత. తక్కువ సమయంలోనే మంత్రి పదవి దక్కించుకున్న సరే..ఎక్కువ కాలం నిలబెట్టలేకపోయారు. అలాగే ఆ ఎఫెక్ట్ వల్లే మళ్ళీ రాజయ్యకు మంత్రి పదవి దక్కలేదు. ఇలా చేతికొచ్చిన మంత్రి పదవి పోగొట్టుకున్న రాజయ్య..రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్ పార్టీలో. 1997లో కాంగ్రెస్‌లోకి వచ్చిన రాజయ్య 1999 ఎన్నికల్లో స్టేషన్‌ఘనపూర్ నుంచి పోటీ చేసి..అప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసిన కడియం శ్రీహరి చేతిలో ఓడిపోయారు.

ఇక 2004లో రాజయ్యకు సీటు దొరకలేదు..2008 ఘనపూర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మళ్ళీ కడియం చేతిలో ఓడిపోయారు. అయితే 2009 ఎన్నికల్లో రాజయ్యకు తొలి విజయం దక్కింది. తెలంగాణ ఉద్యమం పెరగడంతో 2012లో కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. అలాగే 2012 ఉపఎన్నికలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. మళ్ళీ 2014 ఎన్నికల్లో సత్తా చాటారు. పైగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. దీంతో రాజయ్యకు బంపర్ ఆఫర్ దక్కింది...వైద్య శాఖ మంత్రితో పాటు డిప్యూటీ సీఎం హోదా దక్కింది.

కానీ మంచి పదవి దక్కినా సరే ఎక్కువ కాలం నిలబెట్టలేకపోయారు. వైద్య శాఖలో కొన్ని అక్రమాలు రాజయ్య మెడకు చుట్టుకున్నాయి. దీంతో కేసీఆర్, రాజయ్యని క్యాబినెట్ నుంచి తప్పించి...టీఆర్ఎస్‌లో చేరిన కడియంకు ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి, డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో ఘనపూర్ సీటు నుంచి మరొకసారి పోటీ చేసి రాజయ్య గెలిచారు.

ఇక ఎమ్మెల్యేగా ఘనపూర్‌లో అభివృద్ధి కార్యక్రమాలు...ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చేయడం చేస్తున్నారు. అయితే రాజయ్య మంత్రి పదవి కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. కానీ కడియం ఉన్నారు కాబట్టి, రాజయ్యకు మళ్ళీ పదవి దక్కే అవకాశాలు కనిపించడం లేదు. రాజకీయంగా ఘనపూర్‌లో రాజయ్య స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ఆయనకు మరొకసారి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్ తరుపున సింగాపురం ఇందిరా పనిచేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అంత పికప్ అయినట్లు కనిపించడం లేదు. ఘనపూర్‌లో బీజేపీకి బలం లేదు.    


మరింత సమాచారం తెలుసుకోండి: