శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. జనవరి 14, 1937న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. కృష్ణా జిల్లా చిన నందిగామ ఇతని స్వగ్రామం.. తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణ రావు. మైలవరం ఉన్నత పాఠశాలలో చదివేరోజుల్లో శోభన్ బాబు నాటకాల పైన ఆసక్తి పెంచుకొని అనతికాలంలో మంచి నటుడిగా పేరు పొందాడు. గుంటూరు ఎ.సి.కాలేజిలో 'పునర్జన్మ' వంటి నాటకాలలో మంచి పేరు సంపాదించుకొన్నాడు. ఉన్నత పాఠశాల చదువు పూర్తి అయిన తర్వాత విజయవాడలో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదువు పూర్తి చేసాడు.


చిన్నప్పటినుండి సినిమాలంటే చాలా ఇష్టపడేవాడినని, తిరువూరులో కీలుగుర్రం తను చూసిన మొదటి సినిమా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. పాతాళ భైరవి, మల్లీశ్వరి, దేవదాసు తను భాల్యంలో బాగా అభిమానించిన సినిమాలని, మల్లీశ్వరి సినిమాను 22 సార్లు చూశానని తెలిపాడు. శోభన్ బాబు నటజీవితంలో ఎన్నో చిత్రాలు ఘనవిజయం సాధించి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొన్ని తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి.


మనుషులు మారాలి, దేవత, పుట్టినిల్లు మెట్టినిల్లు, గోరింటాకు, సోగ్గాడు, సంపూర్ణ రామాయణము, ఇల్లాలు ప్రియురాలు,మొదలగు ఎన్నో చిత్రాలు శోభన్ బాబుకు పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి శోభన్ బాబుకు నటభూషణ, సోగ్గాడు ఆంధ్రా అందగాడు అనే బిరుదులు లభించాయి.


అనతి కాలంలో దేవత, పండంటి కాపురం, కార్తీక దీపం వంటి కుటుంబ కథా చిత్రాలలో నటించి మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయకుడయ్యాడు. దాదాపు అన్ని కుటుంబ చిత్రాలలో బాధ్యత గల కుటుంబ పెద్దగా, భార్యను ప్రేమించి గౌరవించే వ్యక్తిగా గౌరవప్రథమయిన పాత్రలు పోషించాడు. అప్పట్లో అమ్మాయిలు తమకు కాబోయే భర్త శోభన్ బాబులా అందగాడు మాత్రమే కాకుండా ఆయన పోషించే పాత్రల వ్యక్తిత్వం కలిగి ఉండాలని కోరుకొనేవారు!


మరింత సమాచారం తెలుసుకోండి: